కార్తీక సోమవారంలో వేటిని దానంగా ఇవ్వాలి ?
హరిహరుల అనుగ్రహాన్ని సమానంగా అందించే అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీకమాసం చెప్పబడుతోంది. ఇక ఈ మాసంలో శివుడికి ప్రీతికరమైన సోమవారం రోజున ఆయనని పూజించడం వలన లభించే పుణ్యవిశేషం మాటల్లో చెప్పలేనిది. ఈ కారణంగానే ఈ రోజున ఒకపూట ఉపవాస దీక్షను చేపడుతుంటారు.
తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసిన భక్తులు దగ్గరలోని శివలాయాలకు వెళుతూ వుంటారు. స్వామివారికి ఆవుపాలతో అభిషేకం ... బిల్వదళాలతో అర్చన చేయిస్తూ ఉంటారు. ఈ రోజున ఉసిరికాయను తినకూడదనే నియమం చెప్పబడుతోంది. కార్తీకమాసంలో స్నానం తరువాత అంతటి పుణ్యఫలాన్ని ప్రసాదించేదిగా 'దానం' కనిపిస్తుంది.
కార్తీకమాసం ప్రారంభం నుంచి చివరివరకూ ఒక్కోరోజు ఒక్కోదానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఒక్కో దానం అందించే ఫలితం విశేషంగా వుంటుంది. ఈ నేపథ్యంలో కార్తీక సోమవారం రోజున 'విభూతి పండ్లు' దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. ఈ రోజున విభూతి పండ్లను దానంగా ఇవ్వడం వలన ఆరోగ్యవృద్ధి ... ఐశ్వర్య వృద్ధి కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.
జీవితం సుఖసంతోషాలతో సాగిపోవడనికీ ... ఉత్తమగతులను పొందడానికి కార్తీకమాసపు స్నాన దానాలు ఎంతగానో దోహదం చేస్తాయి. అంతటి పుణ్యరాశిని ప్రసాదించే కార్తీక సోమవారం రోజున విభూతి పండ్లను దానం చేయడం మరిచిపోకూడదు.