ఇక్కడి శివుడు ఇలా దర్శనమిస్తాడు
కొన్ని శైవ క్షేత్రాలను దర్శించినప్పుడు ప్రధానమైన శివలింగం గర్భాలయంలోను ... మిగతా శివలింగాలు ఆరుబయట కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రధానమైన శివలింగం కూడా ఆరుబయటే పూజలందుకునే క్షేత్రాలు కూడా లేకపోలేదు. అక్కడ శివుడు అలా ఆరుబయట ఉండటానికి కొన్ని ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి.
ఇక ముఖమండపమే తప్ప గర్భాలయం పైకప్పు లేకుండా దర్శనమిచ్చే శివాలయాలు కూడా అరుదుగా దర్శనమిస్తూ ఉంటాయి. అలా భక్తులను అగ్రహించే ఆదిదేవుడు 'దొమ్మేరు' క్షేత్రంలో కనిపిస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది.
క్రీ.శ.11వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడినట్టు చరిత్ర చెబుతోంది. స్వామివారి గర్భాలయానికి పై కప్పు లేకపోవడం గురించి కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఇక్కడ వినిపిస్తూ వుంటాయి. ఇక ముఖమండపం ఆనాటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక చెక్క స్తంభాన్ని మూలాధారంగా చేసుకుని ఈ మంటప నిర్మాణం జరిగినట్టు చెబుతారు. ఆలయాన్ని దర్శించిన భక్తులు ఈ నిర్మాణ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులవుతుంటారు.
సోమవారాల్లోను ... పర్వదినాల్లోను ... కార్తీకమాసంలోను ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక్కడి సదాశివుడిని పూజించడం వలన సమస్యలు మబ్బు తెప్పల్లా తొలగిపోతాయనీ, సంతోషాలనిచ్చే శుభాలు చేకూరతాయని చెబుతుంటారు.