నాగులచవితి రోజున ఈ దానం మంచిదట !

నాగులను దేవతలుగా ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. భగవంతుడి సేవలో తరించే నాగులు దైవత్వాన్ని సంతరించుకుని మానవాళికి తమవంతు సహాయ సకారాలను అందిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా పంటలకి నష్టం వాటిల్లకుండా ఉండటంలో ఇవి ప్రధానమైన పాత్రని పోషిస్తాయని అంటారు.

నాగులపట్ల కృతజ్ఞతగా తాము ఉపవాస దీక్షను చేపట్టి వాటిని పూజించి ఆహారాన్ని సమకూర్చడమే 'నాగులచవితి' ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తూ ఉంటుంది. పుట్టలు ... పంటపొలాల్లోని కలుగులు ... పాముల నివాసా స్థానాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణంగా పుట్టలను పడగొట్టడం ... కలుగులను పూడ్చడం ... నేలను తవ్వడం వంటివి ఈ రోజున చేయకూడదనే నియమం వుంది.

పూజామందిరంలో గల సర్పరూప సుబ్రహ్మణ్యస్వామిని ఈ రోజున మల్లెపూలు ... మొగలిపూలు ... సంపెంగ పూలతో పూజించవలసి ఉంటుంది. చిమ్మిలి ... చలిమిడి ... వడపప్పు .. అరటిపండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలో వచ్చే నాగులచవితి రోజున ఎవరికి ఏ దానం చేయాలనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది.

ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి నాగపూజ చేసినవాళ్లు .. బ్రహ్మచారిని సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి, దక్షిణ తాంబూలాలతో నూతన వస్త్రాలను దానం చేయాలని చెప్పబడుతోంది. ఈ విధంగా నాగులచవితి రోజున ఉపవాసం ఉండటం ... సర్పరూప సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం ... పుట్టచుట్టు ప్రదక్షిణలు చేయడం ... ఆవుపాలు పోయడం ... పుట్టమన్నును చెవులకు ధరించడం ... బ్రహ్మచారికి వస్త్రదానం చేయడం ఆ స్వామిపట్ల గల భక్తి విశ్వాసాలకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. దాంతో ఆ స్వామి అనుగ్రహించడం ... సమస్త దోషాలను నశింపజేసి సకల శుభాలను ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది.


More Bhakti News