నైవేద్యాన్ని శ్వేతనాగు స్వీకరిస్తుందట !
కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు ఆ క్షేత్రాన్ని ఒక సర్పం రక్షిస్తూ ఉంటుందనే విషయం తెలిసినప్పుడు ఆసక్తి కలుగుతుంది. మిగతా సర్పాలకు భిన్నంగా ఆ సర్పం దివ్యమైన తేజస్సును కలిగి ఉంటుందనీ, అది అక్కడి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుందని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి దివ్య సర్పం నైవేద్యాన్ని స్వీకరిస్తుందని తెలిసినప్పుడు ఎవరైనాసరే విస్మయానికి గురవుతారు.
సాధారణంగా ఇలాంటి విషయాలు నోటి మాటగానే వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ విషయం శాసన రూపంగా కనిపించినప్పుడు నమ్మక తప్పదనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ సంఘటనకు వేదికగా నిలిచిన క్షేత్రం 'బొర్రాయిపాలెం' లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
శ్రీదేవి - భూదేవి సమేతంగా కొలువైన వేంకటేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తూ వుంటాడు. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగివున్న ఈ క్షేత్రాన్ని చూడగానే మహిమాన్వితమైనదనే విషయం తెలిసిపోతూ వుంటుంది. ఇక్కడి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించిన అనంతరం తలుపులు మూయాలనీ, ఆ సమయంలో ఓ శ్వేతనాగు వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తుందని ఇక్కడి ప్రాచీనకాలం నాటి శిలాశాసనంలో పేర్కొనడం జరిగింది.
పురాతనమైన ఈ శాసనంలో గల విషయం పట్ల ఇక్కడివాళ్లు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. అసత్యాన్ని శాసన రూపంలో తెలియపరిచే అవకాశమే లేదు కనుక, స్వామివారుగానీ ... ఆయన సేవలో తరిస్తోన్న సర్పరాజం గాని ఆ రూపంలో వస్తుండ వచ్చని అంటారు. స్వామివారి మూలమూర్తి కూడా ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి, నిజంగానే నుంచుని ఉన్నాడనిపించేలా కనిపిస్తాడని చెబుతారు. ఆయన లీలావిశేషాలను అనుభవపూర్వకంగా ఆవిష్కరిస్తూ ఆనందంతో పొంగిపోతుంటారు.