కార్తీకమాసంలో తులసి పూజా ఫలితం !
కార్తీకమాసం ఒక్కోరోజు ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ప్రతి పూజా హరిహరుల అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వుంటుంది. అలాంటి కార్తీకమాసంలో చెప్పబడుతోన్న విశిష్టమైన పూజల్లో 'తులసి పూజ' ఒకటిగా కనిపిస్తుంది.
సాధారణంగా చాలామంది ఇళ్లలో తులసికోట కనిపిస్తూ వుంటుంది. స్నానం చేయగానే తులసిమొక్కకు ప్రదక్షిణలు చేసి పూజిస్తూ ఉంటారు. అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న తులసిని, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తుంటారు. కార్తీకమాసంలో లక్ష్మీనారాయణులు తులసికోటలో కొలువై ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగా కార్తీకంలో తులసిపూజ మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.
లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తల్లి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తే నట్టింట్లో సిరులవాన కురుస్తుంది. కార్తీకమాసంలో తులసిని పూజించడం వలన కూడా ఇదే ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది. ఈ మాసంలో తులసిని పూజించడం వలన ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోయి, సంపదలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.
దుష్ట ప్రయోగాలు ... విషకీటకాలు దరిదాపుల్లోకి రానీయకుండా చేసే శక్తి తులసికి వుంది. ఇంటికి తులసి రక్షణ కవచమనీ ...కోరికలను నెరవేర్చే కల్పవృక్షంతో సమానమని అంటారు. ఆరోగ్యంతోపాటు ఆర్ధికపరమైన అభివృద్ధిని వరంగా ప్రసాదించే తులసిని కార్తీకంలో పూజించడం ఎలాంటి పరిస్థితుల్లోను మరిచిపోకూడదు.