నాగదేవత ఏ వరాలను ప్రసాదిస్తుంది ?

కార్తీక శుద్ధ చవితి ... 'నాగులచవితి'గా చెప్పబడుతోంది. ఈ రోజున నాగదేవతను పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కార్తీకమాసం ... శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివకేశవులను పూజించడం వలన విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి.

అలాంటి శివకేశవులను సర్పజాతి సేవిస్తూనే వుంటుంది. పరమశివుడి కంఠాభరణంగా ... శ్రీమన్నారాయణుడి తల్పంగా వారి సేవలో తరిస్తూనే వుంటుంది. హరిహరుల అనుగ్రహంతోనే నాగజాతి కూడా ఈ కార్తీకమాసంలో పూజలందుకుంటోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పూజా మందిరంలో గల సర్పరూప సుబ్రహ్మణ్యస్వామికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు.

నాగులపుట్ట దగ్గరికి వెళ్లి పుట్టను అలంకరించి దానిపై నూకలు చల్లి .. పుట్టలో ఆవు పాలుపోస్తారు. చిమ్మిలి ... చలిమిడి ... వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆ పుట్ట నుంచి కొంత మట్టిని తీసుకుని దానిని కళ్లకు అద్దుకుని చెవులకు రాసుకుంటారు. ఈ విధంగా చేయడం వలన కళ్లకి ... చెవులకు సంబంధించిన వ్యాధులు దగ్గరికిరావని అంటారు.

ఈ రోజున నాగదేవతను ఆరాధించడం వలన సర్పభయాలు ... దోషాలు తొలగిపోతాయి. సర్పదోషాల కారణంగా ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇతర దోషాల కారణంగా వివాహం విషయంలోనూ ... సంతానం విషయంలోను ఆలస్యం జరుగుతున్నప్పుడు ఇలా నాగదేవతను పూజించడం వలన ఆశించిన ఫలితాలు కనిపిస్తాయని చెప్పబడుతోంది. నాగదేవత అనుగ్రహం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ... అభీష్టాలను నెరవేరుస్తుంది.


More Bhakti News