సకల సంపదల పుట్టినిల్లు లక్ష్మీదేవి
చెరగని చిరునవ్వు ... ప్రేమనిండిన ప్రశాంతత ... అనురాగపూర్వకమైన ఆదరణ ... ఇవన్నీ కలగలిసిన దేవతగా లక్ష్మీదేవి కనిపిస్తుంది. లోకంలో .. పలకరించేవారికే ఎవరైనా కష్టాలు చెప్పుకుంటారు. ఆదరించేవారి చెంతనే ఆవేదనని వ్యక్తం చేస్తారు. సౌమ్యంగా కనిపించేవారినే సాయం అడుగుతారు. అలా మంచితనంగా ... మంచిగంధంలా కనిపిస్తుంది కనుకనే అంతా తమ బాధలను లక్ష్మీదేవితో చెప్పుకుంటూ వుంటారు.
శ్రీమహావిష్ణువు హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్న లక్ష్మీదేవి, తన భక్తుల అవసరాలను గుర్తిస్తూనే వుంటుంది ... కోరినంతనే వాళ్ల కష్టాలను తీరుస్తూ వుంటుంది. అష్టలక్ష్ములుగా సకల సంపదలను అందించే ఆ తల్లిని ఎల్లప్పుడూ పూజిస్తూనే వుండాలి. చల్లని మనసున్న ఆ తల్లికి దగ్గర కావడమంటే, దారిద్ర్యానికి దూరంగా ఉండటమే.
ఆకలిబాధ ఎలా వుంటుందో ... అవమానం ఎలా వుంటుందో ... దారిద్ర్యం మాత్రమే చెప్పగలుగుతుంది. ఎన్నో కష్టాలు ... మరెన్నో నష్టాలకు అర్థం తెలిసేలా చేయగలుగుతుంది. ఎవరికీ సాయాన్ని అందించలేని పరిస్థితికి తీసుకురావడమే కాకుండా, సాయం చేద్దామని అనుకునేవారికి కూడా ఏదో ఒక రూపంలో అది అడ్డుతగులుతుంది.
ఆనందం నుంచి ... అభివృద్ధి నుంచి ... అయినవారి నుంచి వెలివేసేలా చేస్తుంది కనుకనే దారిద్ర్యానికి అంతా భయపడుతుంటారు. అలాంటి దారిద్ర్యానికి గురికాకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అది దక్కాలంటే పవిత్రమైన జీవిన విధానాన్ని కొనసాగిస్తూ లక్ష్మీదేవిని అనునిత్యం ఆరాధిస్తూ వుండాలి ... అంకితభావంతో సేవిస్తూ వుండాలి. అప్పుడే దారిద్ర్యం దూరమవుతుంది ... సకల భోగాలకు కారణమైన సంపద చేరువవుతుంది.