కార్తీక మాసంలో అన్నదానం విశిష్టత

కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసంలో నదీస్నానం ... దీపారాధన ... జపతపాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఇక దానధర్మాల వలన పుణ్యరాశి అంతకంతకూ పెరుగుతూపోతుంది. అందువలన ఈ మాసంలో ఎవరికి తోచినంతలో వాళ్లు దానధర్మాలు చేస్తుంటారు.

దానమనేది అనేక రకాలుగా ఉంటుంది ... చేసిన దానాన్నిబట్టి ఫలితం ఉంటుంది. కార్తీకమాసంలో దేనిని దానం చేసినా అది అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తుందని చెప్పబడుతోంది. సాధారణంగా దానాలలో అన్నదానానికి మించినది లేదని అంటారు. అన్నంపెట్టిన వాళ్లు ... ఆకలితీర్చిన వాళ్లు దైవ స్వరూపాలుగా చెప్పబడుతున్నారు ... చూడబడుతున్నారు.

సమస్త దోషాలను నశింపజేసి సకల శుభాలను కలగజేసే శక్తి అన్నదానానికి వుంది. ఈ కారణంగానే శుభకార్యాలలోను ... దైవ కార్యాలలోను అన్నదానానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు. మామూలు రోజుల్లో చేసే అన్నదానమే విశేష పుణ్యఫలాలను ఇస్తుందంటే, ఇక పవిత్రమైన మాసంగా చెప్పబడుతోన్న కార్తీకమాసంలో అన్నదానం వలన లభించే ఫలితం ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

కార్తీకంలో అన్నదానం వలన స్త్రీల సౌభాగ్యం వృద్ధి చెందుతుందని చెప్పబడుతోంది. స్త్రీలు ఏ పూజ చేసినా ... ఏ నోము నోచినా తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ చేసే ప్రార్ధన అందులో ప్రధానంగా కనిపిస్తుంది. అలా సౌభాగ్యం గురించి స్త్రీలు చేసే ప్రార్ధన కార్తీకమాసంలో అన్నదానం చేయడం వలన తప్పక ఫలిస్తుందని చెప్పబడుతోంది. అనేక శుభాలతో పాటు కలకాలం నిలిచి వుండే సౌభాగ్యాన్ని ప్రసాదించే అన్నదానాన్ని కార్తీకంలో చేయడం మరిచిపోకూడదు.


More Bhakti News