తులసిమాల ధరిస్తే కలిగే ఫలితం !
కార్తీకమాసం ... పరమ పవిత్రమైన మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తులసిని పూజించడం వలన ... తులసిదళాలతో శ్రీమహావిష్ణువును అర్చించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తులసిని పూజించడం వలన ... తులసిదళాలతో స్వామివారిని సేవించడం వలన ఎంతటి ఫలితం లభిస్తుందో, తులసిమాలను ధరించడం వలన కూడా అంతే ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.
లక్ష్మీనారాయణులు తులసిని ఆశ్రయించి ఉంటారు. అందువలన తులసిమాలను ధరించినవారిపై వాళ్ల కృపాకటాక్షాలు ఉంటాయని అంటారు. సాధారణంగా ఈ మాసంలో దైవారాధన ... దీక్షధారణ ... జపతపాలు ... ఎక్కువగా జరుగుతూ వుంటాయి. కార్తీకమాసంలో దీక్షలు చేపట్టేవాళ్లు ... జపాలు చేసుకునేవాళ్లు 'తులసిమాల'ను తీసుకుంటూ వుంటారు. జపం చేసుకునేందుకు ... కంఠహారంగాను తులసిమాలను ఉపయోగిస్తూ ఉంటారు.
తులసిమాలను ధరించడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది ... ఆ ప్రశాంతత కారణంగా భగవంతుడి పాదాలపై దృష్టి నిలుస్తుంది. అంతే కాకుండా అనారోగ్యాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి ... సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అనేక దోషాలను దూరంచేసి .. భగవంతుడిపట్ల మనసు నిలిచేలా చేసి .. తలపెట్టిన దైవకార్యాలు ఫలించేలా చేసి పుణ్యఫలాలను అందించడంలో తులసిమాల ప్రధానమైన పాత్రను పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.