భక్తుల బాధలను స్వీకరించే బాబా
శిరిడీలోను ... ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోను బాబాను సకలదేవతా స్వరూపంగా భావిస్తూ ఉండేవాళ్లు. కష్టమైనా ... నష్టమైనా ఆయనతోనే చెప్పుకుంటూ ఉండేవాళ్లు. ఇక తనను విశ్వసించినవారిని బాబా కంటికి రెప్పలా కాపాడుతూ .. వాళ్లు అనుభవించలేని బాధలను తాను స్వీకరిస్తూ ఉండేవాడు.
మంటల్లో పడబోయిన పసిపిల్లవాడిని కాపాడటం కోసం చేయి కాల్చుకున్న బాబా, ప్లేగువ్యాధి బారినుంచి గ్రామస్తులను కాపాడటం కోసం ఆ భాదను కూడా భరించాడు. అలాంటి బాబా ... తాత్యా విషయంలో ఏం చేయనున్నాడనే విషయం గురించే అంతా ఆలోచిస్తూ వుంటారు.
ఎందుకంటే అప్పటికే తీవ్రమైన అనారోగ్యంతో తాత్యా బాధపడుతూ వుంటాడు. విపరీతమైన దగ్గు ... ఆయాసం అతణ్ణి సతమతం చేస్తుంటాయి. అయినా తన పరిస్థితి బాబాకి తెలియకుండా అతను జాగ్రత్తపడుతుంటాడు. దైవస్వరూపుడైన బాబాకి ఈ విషయం తెలియకుండా ఉండదని ఆయన సహచరులు అనుకుంటారు. అయితే తాత్యా పడుతున్న బాధను చూడలేక, బాబా దగ్గర ఆవేదనను వ్యక్తం చేస్తారు.
తాను ఉండగా తాత్యాకి ఏమీకాదనీ ... అతని విషయంలో ఆందోళన చెందవలసిన పనిలేదని చెబుతాడు. ఆ రాత్రే తాత్యా అనారోగ్యం పూర్తిగా తొలగిపోతుంది. తన వ్యాధిని బాబా స్వీకరించి ఉంటాడని భావించిన తాత్యా, తీవ్రమైన ఆందోళనకి లోనవుతూ మశీదుకి పరిగెత్తుకు వస్తాడు. తాను అనుకున్నదే నిజం కావడంతో కన్నీటి పర్యంతమవుతూ అక్కడే కుప్పకూలిపోతాడు.