కష్టాల్లో కరుణించే అమ్మవారు
స్త్రీలు అమ్మవారి ఆలయాలను ఎక్కువగా దర్శిస్తూ వుంటారు ... అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ వుంటారు. అమ్మవారితో వాళ్లకి మరింతగా అనుబంధం ఉండటమే అందుకు కారణం. స్త్రీలు తమ వైవాహిక జీవితానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. సంతాన సౌభాగ్యాలకు మించిన సంపదలేదని భావిస్తారు. అమ్మ మనసుకి అన్నీ తెలుసని విశ్వసిస్తారు.
ఈ కారణంగానే అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆశీస్సులకి మించిన వరం లేదని భావిస్తుంటారు. అలా అనునిత్యం భక్తుల పూజలు అందుకుంటోన్న అమ్మవారి ఆలయాలలో ఒకటి 'యాదగిరిపల్లి' లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది.
ఇక్కడి అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. చుట్టుపక్కల ప్రాంతాలవారు సైతం ఇక్కడి అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ ఉండటాన్ని బట్టి అమ్మవారి మహాత్మ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాళ్లు అమ్మవారిని దర్శించి తమ ఆవేదనను చెప్పుకుంటే చాలు, ఆ తల్లి వెంటనే కరుణిస్తుందని చెప్పుకుంటూ ఉంటారు.
వివాహయోగం ... సంతాన భాగ్యం ... కలకాలం నిలించి వుండే సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందని అంటారు. దసరా నవరాత్రుల సందర్భంలోనూ ... కార్తీక మాసంలోను ఇక్కడి అమ్మవారికి ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతుంటాయి. అమ్మవారిని దర్శించిన భక్తులు ఆమె అనుగ్రహం తమయందు ఎల్లవేళలా ఉండేలా చూడమని ఆ తల్లిని కోరుతుంటారు ... చీరసారెలు సమర్పించి తరిస్తుంటారు.