అపమృత్యు దోషం ఇలా తొలగుతుందట !
జీవితంలో కొన్ని భయాలు ... ఆందోళనలు మనసుకి ప్రశాంతత లేకుండా చేస్తుంటాయి. ఏదో తెలియని ప్రమాదం తమని ఆపదలో పడేయబోతుందనే ఆలోచన స్థిమితం లేకుండా చేస్తూ వుంటుంది. మానసికపరమైన ఇలాంటి ఆందోళనలు తొలగిపోవాలంటే ... అకాలమృత్యువు బారిన పడకుండా ఉండాలంటే 'కార్తీక శుద్ధ విదియ' రోజున యమధర్మరాజును శాంతింపజేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
కార్తీక శుద్ధ విదియనే 'యమద్వితీయ' అని పిలుస్తుంటారు. ఈ రోజున దీపాలు పెట్టే వేళకి కాస్తంత ముందు నాలుగు వత్తులు గల దీపాన్నివాకిట్లో వెలిగించాలి. ఇది యముడి ఆరాధనను తెలియజేసి ఆయనని శాంతింపజేస్తుంది. యముడి అనుగ్రహం కలగడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది. ఇక ఈ రోజునే భ్రాతృ విదియ ... భగినీహస్త భోజనంగా పిలుస్తుంటారు.
ఈ రోజున స్త్రీలు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి వారికి ఇష్టమైన వంటకాలతో భోజనం పెట్టాలి. ఫలితంగా ఆ స్త్రీల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందనీ ... సోదరుల అపమృత్యు దోషాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. ఈ విధమైన వరాన్ని యమధర్మరాజు నుంచి ఆయన సోదరి పొందినదనేది పురాణ కథనంగా వినిపిస్తుంది.