నరకాసురుడు నేలకొరిగిన ప్రదేశం ఇదేనట !
ఆశ్వయుజ బహుళ చతుర్దశి ... 'నరకచతుర్దశి' గా చెప్పబడుతోంది. ఈ రోజున నరకాసుర సంహారం జరిగిన కారణంగా ప్రజలంతా సంతోషంగా జరుపుకునే పండుగగా 'దీపావళి' కనిపిస్తుంది. నరకాసురుడు తన తల్లి అయిన భూదేవి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేకుండగా వరాన్ని పొందుతాడు.
లోకంలో నరకుడి ఆగడాలు అంతకంతకూ ఎక్కువైపోతూ ఉండటంతో, అతణ్ణి సంహరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు శ్రీమన్నారాయణుడు. ఆ పథక రచన ప్రకారం సత్యభామగా ... శ్రీకృష్ణుడి అర్థాంగిగా అవతరించిన భూదేవి, నరకాసురుడిని సంహరిస్తుంది. అప్పటి వరకూ ఆయన వలన నానాబాధలు అనుభవించిన ప్రజలు దీపాలు వెలిగించి ... మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు.
ఆనాటి నుంచి ఈ రోజున 'దీపావళి' వెలుగులలో సంబరాలు జరుగుతూనే వున్నాయి. లోక కల్యాణానికి కారణమైన ఈ ఘట్టం ఎక్కడి జరిగి ఉంటుందనే సందేహం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడు ... సత్యభామ నడయాడిన ఆ ప్రదేశం ... నరకాసురుడు నేల కొరిగిన ఆ ప్రదేశం కృష్ణా జిల్లా 'నడకుదురు' గ్రామమేనని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.
నరకుదురు అనే పేరే కాలక్రమంలో మార్పుచెంది 'నడకుదురు' గా పిలవబడుతోందని అంటారు. నరకాసురుడి సంహారం ఇక్కడే జరిగిందనీ ... సత్యభామ - శ్రీకృష్ణుడి పాదస్పర్శతో ఈ ప్రదేశం మరింత పవిత్రమైందనడానికి నిదర్శనంగా కొన్ని ఆనవాళ్లను చూపుతుంటారు. నరకచతుర్దశి ... దీపావళి ఇక్కడ మరింత ప్రత్యేకతను సంతరించుకుని ఘనంగా జరుగుతుంటాయి. ఈ రోజుల్లో ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.