మహిమ చూపే మహాదేవుడి క్షేత్రం
పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి 'బి.అన్నవరం' గ్రామంలో కనిపిస్తుంది. అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలంలో దర్శనమిస్తుంది.
సాధారణంగా ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. కాకతీయుల నిర్మాణ శైలి ... వాళ్ల కాలంలో శివలింగాలు రూపొందిన విధానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ... శివలింగాకృతి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ వుంటుంది. అందువలన ఇది కాకతీయుల కాలానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతోంది.
ఇక్కడి ఆధారాలపై పరిశోధన జరిగితే ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం లభించే అవకాశం వుంది. ఎంతోమంది మహారాజులు ... సంస్థానాధీశులు ... మహాభక్తులు ఇక్కడి స్వామివారి దర్శనం చేసుకుని తరించారని అంటారు. పూర్వం ఈ ప్రాంతం నుంచి 'శ్రీశైలం' వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడి సదాశివుడిని దర్శించుకుని వెళ్లేవాళ్లట.
ఈ స్వామిని ముందుగా దర్శించుకోవడం వలన అత్యంత కష్టతరమైన శ్రీశైల ప్రయాణంలో ఎలాంటి ఆపదలు ... ఆటంకాలు సంభవించవని విశ్వసించేవారట. ఎలాంటి ఆపదలైనా ఈ స్వామి దర్శనమాత్రం చేత దూరమవుతాయనే విశ్వాసం ఇప్పటికీ ఇక్కడ బలంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఆపదలను తొలగించే ఇక్కడి మహాదేవుడిని మహిమాన్వితుడుగా చెప్పుకుంటూ వుంటారు ... కనులారా ఆ స్వామిని దర్శిస్తూ మనసారా సేవిస్తూ వుంటారు.