వంశాభివృద్ధిని కలిగించే గోమాత సేవ

సూర్యవంశపు రాజైన దిలీపుడు పుత్ర సంతానం కోసం తపిస్తూ వుంటాడు. ఈ విషయంలో మహర్షుల సూచన తీసుకోవడం మంచిదని భావించిన ఆయన, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆయనని కలుసుకుంటాడు. తన ఆవేదనను వ్యక్తం చేసి ... తన కోరిక నెరవేరేలా చేయమని అడుగుతాడు.

గోమాత సేవ వలన వంశాభివృద్ధి కలుగుతుందనీ ... వంశం తరిస్తుందని చెబుతాడు వశిష్ఠుడు. గోమాతను రక్షిస్తూ దాని పోషణ బాధ్యతను స్వీకరించమని అంటాడు. అందుకుగాను తన ఆశ్రమంలో గల గోమాత సేవకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించమని చెబుతాడు. అయితే గోరక్షణ ... గోసేవ రెండూ కూడా అంకితభావంతో చేసినప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని అంటాడు.

ఆ మాటలను అర్థం చేసుకున్న దిలీపుడు ప్రతిరోజు రాచకార్యాలు ముగించుకుని వశిష్ఠుడి ఆశ్రమానికి చేరుకునేవాడు. అక్కడే గోవు సేవ చేస్తూ కొంత సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచాక, గోరక్షణ .. సేవ విషయంలో ఆయన అంకితభావాన్ని వశిష్ఠుడు పరీక్షించాలని అనుకుంటాడు. గోమాతకు దిలీపుడు ఆహారాన్ని అందిస్తోన్న సమయంలో, ఆశ్రమానికి సమీపంగా వశిష్ఠుడు ఒక మాయా సింహాన్ని సృష్టిస్తాడు.

గోమాత వైపు వేగంగా దూసుకువస్తోన్న సింహాన్ని దిలీపుడు ధైర్యంగా అడ్డుకుంటాడు. గోమాతను రక్షించడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సైతం సిద్ధపడతాడు. అప్పుడు ఆ సింహం అదృశ్యమైపోగా ఆ వైపు నుంచి వశిష్ఠుడు వస్తాడు. తన మాట పట్ల ఆయనకి గల విశ్వాసాన్ని అభినందిస్తాడు. గోమాత రక్షణలో ... సేవలో తరించడం వలన, గురువు మాట పట్ల అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేయడం వలన ఆయన వంశం ఉద్ధరించబడుతుందని ఆశీర్వదిస్తాడు.


More Bhakti News