ఆడపడచులను అనుగ్రహించే మహంకాళి

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు లోకకల్యాణం కోసం వివిధ నామాలతో అనేక రూపాలను ధరించింది. ఆ రూపాలతో అమ్మవారు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటోంది. అలా భక్తజనులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న అమ్మవారి ఆలయం ఒకటి మనకి 'మహంకాళిగూడెం' లో కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలో .. కృష్ణానదీ తీరంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. అమ్మవారిపట్ల ఇక్కడివారికి గల భక్తిశ్రద్ధల కారణంగానే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. రెండువేల సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ వుండటం విశేషం. ఒకప్పుడు గ్రామదేవతగా పూజలు అందుకున్న ఇక్కడి అమ్మవారు, అనేక మహిమలను భక్తుల అనుభవంలోకి తెచ్చిందట.

కాలక్రమంలో ఆలయం అభివృద్ధి చెందడంతో ... అమ్మవారి మహిమలు వెలుగు చూడటంతో దూరప్రాంతాల నుంచి కూడా ఆ తల్లిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి తమ గ్రామాన్నీ ... దుష్టశక్తుల బారి నుంచి తమని ఈ అమ్మవారు కాపాడుతూ ఉంటుందని స్థానికులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. తమ సంతాన సౌభాగ్యాలను అమ్మవారు సదా రక్షిస్తూ ఉంటుందని నమ్ముతుంటారు.

అమ్మవారి అనుమతి ... ఆ తల్లి ఆశీస్సులు లేకుంగా ఇక్కడ ఎవరూ ఎలాంటి శుభాకార్యాన్ని తలపెట్టకపోవడం విశేషం. ప్రతి యేటా అమ్మవారికి అత్యంత వైభవంగా జరిపే ఉత్సవాలకు, ఇక్కడి ఆడపడచులు ఏ ఊళ్లో వున్నా తప్పక వస్తుంటారు. అమ్మవారి వేడుకలో ఆనందంగా పాల్గొంటూ వుంటారు. మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుని .. ఆశీస్సులు అందుకుని ... సంతోషంగా చీరసారెలు సమర్పించి వెళుతూ వుంటారు.


More Bhakti News