ఇక్కడ కాకి హంసగా మారిందట !

ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్లినప్పుడు సహజంగానే అక్కడి క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుస్తూ వుంటుంది. అక్కడి స్థలపురాణం ద్వారా ఆ క్షేత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చిందనే సందేహం కూడా తీరిపోతూ వుంటుంది. అలా కృష్ణానదీ తీరంలోని ఒక క్షేత్రానికి వెళితే, అక్కడ కాకి ... హంసగా మారిన విషయం తెలుస్తుంది.

ఈ ఒక్క విషయంచాలు ఆ క్షేత్రం ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవడానికి. అలాంటి మహిమాన్వితమైన ఆ క్షేత్రం పేరు ... 'హంసలదీవి'. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో గల ఈ క్షేత్రంలోని వేణుగోపాలస్వామిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు.

సమస్త పాపాలను పోగొట్టుకోవడం కోసం అందరూ గంగలో స్నానం చేస్తుంటారు. అందరి పాపాలను కడిగేసే పవిత్రమైన గంగ, కాలక్రమంలో తన రంగు నల్లగా మారిపోతూ వుండటం గమనిస్తుంది. అందరి పాపాలను తాను గ్రహించడమే అందుకు కారణమని భావించిన గంగ, శ్రీమన్నారాయుణుడిని కలుసుకుని తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది.

కాకి రూపంలో సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేయమనీ, అద్వితీయమైన పుణ్యతీర్థంలో ఆమె మాలిన్యం తొలగిపోతుందనీ, ఫలితంగా కాకి రూపం హంసలా మారిపోతుందని సెలవిస్తాడు. అలా కాకి రూపంలో అనేక పుణ్య తీర్థాలలో స్నానమాడుతూ వచ్చిన గంగ, ఇక్కడి కృష్ణా .. సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేస్తుంది.

అప్పుడామే మాలిన్యం తొలగిపోయి హంసలా మారిపోతుంది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'హంసలదీవి' అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ మహాత్మ్యం కారణంగానే ఈ నదీ సాగర సంగమ క్షేత్రంలో పుణ్యస్నానాలు చేయడానికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు ... పునీతులవుతుంటారు.


More Bhakti News