ఆపదల నుంచి కాపాడే ఆంజనేయుడు

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎదురుపడితే ... జీవితకాలం పాటు తమకి సంతోషాన్ని కలిగించే వరాలను పొందడానికే ప్రయత్నిస్తారు. కానీ ఆ నారాయణుడు ... రాముడిగా నడచివచ్చి ఎదురుగా నిలబడినా హనుమంతుడు తన గురించి ఏమీ అడగలేదు. ఆ నారాయణుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి, వాటి బారి నుంచి ఆయనని బయటపడేయడానికి ఎన్నో కష్టాలను ఇష్టంగా భరించాడు.

సీతారాముల మధ్య ఎడబాటుని దూరం చేసినదీ ... లక్ష్మణుడి విషయంలో రాముడి కన్నీటిని తుడిచినది హనుమంతుడే. అలాంటి హనుమంతుడి రుణం తీర్చుకోలేనిదంటూ రాముడు ఆయనని కౌగిలించుకోవడాన్నిబట్టి హనుమంతుడు చేసిన సేవ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రభు భక్తిలో తనకి సాటిలేదని అనిపించుకున్న హనుమంతుడు, తన భక్తులను ఆదుకోవడంలోను ముందుంటాడు.

ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో హనుమంతుడి ఆలయాలు దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటి 'బొత్తలపాలెం'లో కనిపిస్తుంది. ఈ గ్రామం నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో కనిపిస్తుంది. ప్రాచీనకాలం నాటి ఈ ఆలయంలో 'భక్తాంజనేయుడు' దర్శనమిస్తూ వుంటాడు. ఈ స్వామిని దర్శించి పూజించడం వలన ఆపదలు తొలగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

భక్తుల వెన్నంటి ఉంటూ వారు తలపెట్టిన కార్యాలు సిద్ధించేలా చేయడం ... వాళ్లు ఎలాంటి ఆపదల్లో పడకుండా చూడటం ఇక్కడి స్వామి ప్రత్యేకతగా కనిపిస్తూ వుంటుంది. విశేషమైనటువంటి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేల పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు ఆయన ఆశీస్సులు అందుకుంటూ వుంటారు .. ఆయురారోగ్యలను పొందుతుంటారు.


More Bhakti News