కార్తీకమాసంలో ఆచరించవలసిన విధులు
మాసాలలో కార్తీక మాసానికి సమానమైనది లేదని శాస్త్రం చెబుతోంది. చాంద్రమానాన్ని అనుసరించి ఎనిమిదవ మాసంగా చెప్పబడుతోన్న కార్తీక మాసాన్ని కౌముది ( వెన్నెల) మాసమని అంటారు. కార్తీక మాసానికి అధిదేవుడు 'దామోదరుడు' కనుక దీనిని 'దామోదర మాసం' అని కూడా పిలుస్తుంటారు.
ప్రతి రోజు ఒక విశేషాన్ని కలిగివుండే కార్తీకమాసం, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. హరిహరుల అనుగ్రహాన్ని పొందాలంటే ఈ మాసంలో అనేక విధులను పాటించవలసి వుంటుంది. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కార్తీక దామోదరుడి నామాన్ని స్మరిస్తూ నదీ స్నానం చేయవలసి వుంటుంది. ఈ మాసంలో అన్ని జలాశయాల్లోనూ 'గంగ' అంతర్లీనంగా ప్రవహిస్తూ వుంటుంది కనుక, స్నాన ఫలితం విశేషంగా వుంటుంది.
ఈ మాసంలో చేయబడిన దైవారాధన ... ఉపవాసాలు ... జపాలు ... దీప దానాలు ... కూడా అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో హరిహరులను పూజించడం ... కీర్తించడం ... పురాణ పఠనం చేయడం ... ఆలయాలలో దీపారాధన చేయడం ... వనభోజనాలకు వెళ్లడమనేది కార్తీకమాసంలో ఆచరించవలసిన ప్రధానమైన విధులుగా చెప్పబడుతున్నాయి. ఈ విధులను ఆచరించడం వలన లభించే పుణ్యఫలం జన్మజన్మల పాటు వెంట వస్తుందని స్పష్టం చేయబడుతోంది.