అదే శ్రీమన్నారాయణుడి లీలావిశేషం !
ప్రహ్లాదుడు హరినామాన్ని స్మరిస్తూనే నిద్రలేవడం ... హరినామాన్ని స్మరిస్తూనే నిద్రలోకి జారుకోవడం, హరి ద్వేషి అయిన హిరణ్యకశిపుడు సహించలేకపోతాడు. తన కొడుకే తనకి శత్రువైన శ్రీహరి నామాన్ని పలకడం అవమానకరంగా భావిస్తాడు. శ్రీహరి అనే మాట అతని నోటి వెంట రావడానికి వీల్లేదని మందలిస్తాడు.
అయినా ప్రహ్లాదుడు వినిపించుకోకపోవడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కొన్ని రోజులపాటు ప్రహ్లాదుడికి ఎలాంటి ఆహారం అందించకుండా చెరసాలలో బంధించమని సేనాధిపతిని ఆదేశిస్తాడు. ఆకలితో మాడితే అతనే దారికి వస్తాడని ఆయన భావిస్తాడు. అయితే ఆకలితో ప్రహ్లాదుడు పడే బాధకంటే, అతని ఆకలి తీర్చే అవకాశం లేకపోవడం పట్ల లీలావతి తల్లడిల్లిపోతుంటుంది. భర్త మాట కాదనలేక ... కన్నా కొడుకు ఆకలి తీర్చలేక ఆమె కన్నీళ్ల పర్యంతమవుతుంది.
ఆ కన్నతల్లి పడుతోన్న ఆరాటం శ్రీ మన్నారాయణుడి మనసును కదిలించివేస్తుంది. దాంతో ఆయన ప్రహ్లాదుడి రూపంలో ఆమె మందిరానికి వస్తాడు. దైవానుగ్రహంతోనే ఎవరి కంటా పడకుండా బయటికి వచ్చానని చెబుతాడు. సంతోషంతో లీలావతి అక్కున చేర్చుకుని, అతనికి ప్రేమతో గోరుముద్దలు తినిపిస్తుంది. కడుపు నిండిందని చెప్పడంతో మంచినీళ్లు తాగించి సంతృప్తి చెందుతుంది. ఎవరూ చూడకముందే తిరిగి చెరసాలకి చేరుకోమని చెప్పి పంపించి వేస్తుంది. అలా ఆ శ్రీమన్నారాయణుడు .. బిడ్డ ఆకలి తీర్చడం కోసం తపన పడుతోన్న తల్లి హృదయాన్ని అర్థం చేసుకుని, తనే బిడ్డ రూపాన్ని ధరించి ఆమె మనసును కుదుటపరుస్తాడు.