విశిష్టమైన నాగకుండం ఇక్కడ చూడొచ్చు
పుణ్యక్షేత్రాలలో కనిపించే ఒక్కో దివ్యతీర్థం ఒక్కో ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ తీర్థాలు స్పర్శమాత్రం చేతనే పాపాలను కడిగేసి భగవంతుడి సన్నిధిలో నుంచునే అర్హతను కలిగిస్తూ వుంటాయి. ఉత్తమగతులను కల్పిస్తూ వుంటాయి. అలాంటి దివ్యతీర్థాలలో ఒకటి 'పెదకళ్ళేపల్లి' లో కనిపిస్తుంది.
కృష్ణానదీ తీరంలో ఆవిర్భవించిన పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో 'పెదకళ్ళేపల్లి' ఒకటి. పరమశివుడు 'నాగేశ్వరుడు'గా స్పటికలింగ రూపంలోను ... శిలా సర్పరూపంలోనూ కొలువై వుండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా చెప్పబడుతోంది. స్వామివారు నాగేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటోన్న ఈ క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది.
ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన కాశీ క్షేత్రాన్ని దర్శించిన ఫలితం లభిస్తుందని చెబుతుంటారు. ఇక్కడ రుద్ర .. భైరవ .. బ్రహ్మ .. చంద్ర .. శుక .. నాగ .. అంబిక .. శారద పేర్లతో కుండాలు కనిపిస్తాయి. ప్రతి కుండం ప్రత్యేకతను సంతరించుకుని దర్శనమిస్తుంది. వీటిలో 'నాగకుండం' మరింత మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది.
భగవంతుడి సంకల్పం కారణంగా ఏర్పడటం వలన ... విశిష్టమైనటు వంటి అనేక తీర్థాలు నాగకుండంలో కలవడం వలన ఇందులోని నీరు మహిమాన్వితమైనదని చెప్పబడుతోంది. అలాంటి ఈ కుండం నీరు తలపై చల్లుకోవడం వలన ... తీర్థంగా స్వీకరించడం వలన అనేక జన్మలుగా వెంటాడుతూ వస్తోన్న దోషాలు నశిస్తాయి. ఈ పుణ్యఫల విశేషం కారణంగా ఉత్తమగతులు కలుగుతాయి.