శివకుటుంబం కొలువైన దివ్యక్షేత్రం

సాధారణంగా ప్రాచీనకాలం నాటి శైవ క్షేత్రాలకి వెళితే అక్కడ ఎక్కువగా 'అగస్త్య మహర్షి' పేరు వినపడుతుంది. అగస్త్య మహర్షి అనేక ప్రాంతాల మీదుగా ప్రయాణం చేస్తూ పవిత్రమైనటువంటి చాలా ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ... వాటిని ఆరాధిస్తూ వెళ్లడం జరిగింది. అవన్నీ కూడా అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే 'అత్రి మహర్షి' పేరు మనకి 'జాగర్లమూడి' క్షేత్రంలో వినిపిస్తుంది. సప్త మహర్షులలో ఒకరుగా చెప్పబడుతోన్న అత్రి మహర్షి, మహా తపోబల సంపన్నుడు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడిని పుత్రుడుగా పొందిన వాడాయన. అనునిత్యం శివారాధన చేసే ఆయన ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది.

గుంటూరు జిల్లాలోని ఈ క్షేత్రంలో 'సంగమేశ్వరుడు' పేరుతో స్వామివారు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. జగజ్జనని అయిన పార్వతీదేవి కూడా స్వామి సన్నిధిలోనే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక వినాయకుడు ... సుబ్రహ్మణ్యస్వామి ... వీరభద్రుడు ... కాలబైరవుడు కూడా ఈ ప్రాంగణంలో కొలువుదీరి పూజలు అందుకుంటూ వుంటారు.

శివ కుటుంబాన్ని కలిగిన క్షేత్రాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఎంతో మంది రాజులు ఇక్కడి స్వామిని ఇష్ట దైవంగా ఆరాధించి, ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేశారు. అటు పౌరాణిక నేపథ్యాన్నీ ... ఇటు చారిత్రక వైభవాన్ని కలిగిన ఈ క్షేత్ర దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News