దీపావళి రోజున లక్ష్మీదేవి ఇలా కరుణిస్తుందట !
దీపావళి రోజున తన భక్తులను అనుగ్రహించడం కోసం లక్ష్మీదేవి స్వయంగా వస్తుందట. ఈ కారణంగానే ఈ రోజున అందరూ తమ ఇంటిని మరింత పరిశుభ్రంగా ... పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనేక దీపాలను వెలిగించి ఆనందంతో ఆ తల్లిని ఆహ్వానిస్తారు. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వివిధ రకాల పదార్థాలను ... ఫలాలను నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు.
ఇక ఈ రోజున లక్ష్మీదేవి తమ ఇంటికి తప్పనిసరిగా రావాలనే ఉద్దేశంతో చాలామంది తమ పూజా మందిరాలలో 'శంఖం' ఉండేలా చూస్తుంటారు. లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె ... శంఖాలు కూడా సముద్రం నుంచే పుడతాయి. అందువలన శంఖాలు లక్ష్మీదేవి సోదరులుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ కారణంగా శంఖం వున్న చోటికి లక్ష్మీదేవి తప్పక వస్తుందనీ, ఫలితంగా సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు.
ఇక కొన్ని ప్రాంతాలలో దీపావళి రోజున 'గవ్వలు' ఆడుతూ వుండటం ఆనవాయతీగా కనిపిస్తూ వుంటుంది. శంఖాల మాదిరిగానే గవ్వలు కూడా లక్ష్మీదేవికి తోబుట్టువులుగా చెప్పబడుతోంది. అందువలన గవ్వలు ఆడుతూ వుంటే వచ్చే శబ్దం విని అమ్మవారు తప్పకుండా లోపలికి వస్తుందని నమ్ముతుంటారు. అమ్మవారు యథాలాపంగా చూస్తేనే శ్రీమంతులైపోతారు. అలాంటిది ఆ తల్లి అడుగుపెడితే అంతకుమించిన అదృష్టం ఇంకేమీ వుండదు.
ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా వివిధ స్తోత్రాలు చదువుతుంటారు ... పారాయణం చేస్తుంటారు. ముఖ్యంగా ఆదిశంకరులవారి 'కనకధారా' తప్పక పఠిస్తారు. ఈ రోజున కనకధారా స్తవం చేటడం వలన విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది.