ధన త్రయోదశి పూజా ఫలితం !
శ్రీమన్నారాయణుడిచేత ధనలక్ష్మిగా పట్టాభిషిక్తురాలు అయిన అమ్మవారు, తన భక్తులను అనుగ్రహించడానికి భూలోకానికి బయలుదేరి వచ్చిన రోజు 'ధనత్రయోదశి' గా చెప్పబడుతోంది. ఈ రోజున అమ్మవారిని ఎవరైతే తమ ఇంటికి ఆహ్వానిస్తారో, వాళ్ల ఇల్లు సిరిసంపదలకు నిలయంగా మారుతుంది.
ఇక మరణగండాల నుంచి బయటపడాలనుకునే వాళ్లు యమధర్మరాజుని శాంతింపజేయడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తే అది తప్పక ఫలిస్తుందని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతూ ఆరాధించిన వారి ఇంటి వైపు యమధర్మరాజు రాలేడని అంటారు. ఈ విషయాన్ని స్పష్టం చేసే ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో వుంది.
హిమవంతుడు అనే రాజుకి భోగభాగ్యాలు వున్నా ఆయనని ఒక విషయం మానసికంగా కుంగదీస్తూ వుంటుంది. తన ఒక్కగానొక్క కుమారుడు అల్పాయుష్కుడు కావడమే అందుకు కారణం. అయితే ఈ విషయం తెలిసి కూడా ఒక రాకుమారి ఆ రాజకుమారుడిని వివాహం చేసుకుంటుంది. ధనత్రయోదశి రోజున తన భర్త మరణిస్తాడని జ్యోతిష్యులు చెప్పడంతో, ఆమె లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది.
తన మందిరాన్ని పవిత్రంగా ఉంచుతూ మంగళ తోరణాలతో అలంకరిస్తుంది. తన భర్తకి మృత్యు ఘడియలు సమీపిస్తూ వుండగా, ఆయనని ఒక గదిలో వుంచి ఆ గది ముందు బంగారు ఆభరణాలను రాశిగా పోసి దాని చుట్టూ అనేక దీపాలను వెలిగిస్తుంది. సర్పరూపంలో మృత్యువు అక్కడికి రానేవస్తుంది. అయితే అక్కడి బంగారు కాంతులను ... దీపాల వెలుగులను చూడలేక, ఆ యువతి పట్ల లక్ష్మీదేవికి గల అనుగ్రహ రేఖను దాటుకుని ఆ సర్పం ముందుకు రాలేకపోతుంది.
సర్పాన్ని చూసిన రాకుమారి శాంతించి అనుగ్రహించమంటూ మనసులోనే యమధర్మరాజుని వేడుకుంటుంది. మరణ ఘడియలు దాటిపోవడంతో మృత్యువు వెనుదిరుగుతుంది. అలా ఆ రాకుమారి భర్త బతికి బయటపడతాడు. ఈ రోజున లక్ష్మీదేవికి దీపకాంతులతో ఆహ్వానం పలికి, ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన మరణగండాల నుంచి బయటపడటం జరుగుతుందని చెప్పబడుతోంది. ధనత్రయోదశి పూజా ఫలితంగా ఐశ్వర్యంతో పాటు ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.