భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించాలి
దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున పూజా మందిరంలోను ... గుమ్మానికి ఇరువైపులా ... తులసికోట దగ్గర ... గోశాలలోను దీపాలు వెలిగిస్తూ వుంటారు. ఇక ఇంటి ప్రహరీ గోడపై కూడా వరుసగా దీపాలు వెలిగిస్తూ వుంటారు. మట్టి కుందులు ఒకదానిపై ఒకటి వుంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తూ వుంటారు.
రెండు .. అయిదు ... తొమ్మిది సంఖ్యలో వత్తులు ఉపయోగిస్తూ వుంటారు. వత్తులు సరిగ్గా నూనెలో నానకపోవడం వలన ... వాటి చివరలను నలపకపోవడం వలన దీపాలు కొండెక్కుతూ వుంటాయి. అందువలన వత్తులను బాగా నలపాలి. అలాగే జ్యోతి పెద్దదిగాను ... మరీ చిన్నదిగాను కాకుండా వత్తిని సరిచేస్తూ వుండాలి.
ఇక నూనె పొదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రమిదలలో తక్కువగా పోయడం వలన కూడా అవి త్వరగా కొండెక్కుతూ వుంటాయి. దీపం వెలిగే సమయం మరీ తక్కువగా వుండకూడదు ... వెంటనే కొండెక్కకూడదు. అందువలన నూనె తగినంత పోయవలసి వుంటుంది. ఆరుబయట దీపాలను పెట్టడం వలన గాలికి అవి కొండెక్కే అవకాశం ఎక్కువగా వుంటుంది. అలా జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
దీపం లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది కనుక, అది నిశ్చలంగా ... నిర్మలంగా వెలిగేలా చూసుకోవాలి. దీపాలు వెలిగే తీరే అమ్మవారి పట్ల గల భక్తి శ్రద్ధలను చాటిచెబుతూ ఉంటుంది. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులను చేస్తూ ఉంటుంది.