దీపావళి రోజున లక్ష్మీదేవి వస్తుందా ?

లక్ష్మీదేవి ఎక్కడ కొలువై వుంటుందో అక్కడ సిరిసంపదలకు కొదవ వుండదు. సంపదలు కలిగిన చోట సమస్యలు కూడా తక్కువగానే వుంటాయి. సమస్యలు లేకపోవడమంటే సంతోషంగా ఉన్నట్టుగానే భావించాలి. జీవితం ఆనందంగా గడిచిపోవాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటారు కాబట్టి, అంతా లక్ష్మీదేవి అనుగ్రహం తమపట్ల ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటూ వుంటారు.

వైకుంఠంలో స్వామివారి పాదసేవ చేసే లక్ష్మీదేవి తమ మొరను ఆలకిస్తుందా ? అనే సందేహానికి కొందరు లోనవుతుంటారు. అలాంటి లక్ష్మీదేవి ఒకరోజున మాత్రం తప్పనిసరిగా భూలోకానికి వస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ రోజే ... 'ఆశ్వయుజ బహుళ అమావాస్య'. ఈ రోజునే దీపాలతో అమ్మవారికి ఆహ్వానం పలుకుతుంటారు.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధనత్రయోదశి) రోజున నరకాసురుడి చెరసాల నుంచి లక్ష్మీదేవికి విముక్తిని కల్పిస్తాడు శ్రీమన్నారాయణుడు. ఆ సంతోషంతో అమ్మవారు తన భక్తులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించడానికి బహుళ అమావాస్య (దీపావళి) రోజున భూలోకానికి వస్తుందట. ఏ ఇల్లు పవిత్రతకు ... ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుందో అక్కడ ఉండటానికి అమ్మవారు ఆసక్తి చూపుతుంది.

ఏ ఇంటి గడపకు పసుపు కుంకుమలు ఉంటాయో ... గుమ్మానికి మామిడి తోరణాలు - పూలమాలికలు అలంకరించబడి ఉంటాయో ... వరుస దీపాలు వెలిగించబడి ఉంటాయో వాళ్లు తనని ఆహ్వానిస్తున్నట్టుగా లక్ష్మీదేవి భావిస్తుంది. వెంటనే అక్కడికి వచ్చి తన 'కళ'ను ఆ ఇంట వుంచి వెళుతుంది. అలా ఆ తల్లి అడుగుపెడుతుంది కనుకనే, అమ్మవారి మనసుకి నచ్చేవిధంగా ఇంటిని అలంకరించి ... దీపకాంతుల మధ్య ఆహ్వానం పలుకుతూ లక్ష్మీపూజ చేస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహంతో తమ జీవితం సుఖశాంతులతో సాగిపోవాలని ఆశిస్తూ వుంటారు.


More Bhakti News