దోషాలను నివారించే దీప దర్శనం

సాధారణంగా ప్రతి దేవాలయంలోను దీపారాధన జరుగుతూ వుంటుంది. గర్భాలయంలో కొలువైన దైవాన్ని ఈ దీపారాధన వెలుగులోనే దర్శించాలని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ దీపారాధన కొన్ని దేవాలయాల్లో 'అఖండ దీపం' గా కనిపిస్తూ వుంటుంది. అంటే జ్యోతి కొండెక్కకుండా చూసుకుంటూ, ఎప్పటికప్పుడు నూనె ... వత్తి మారుస్తూ వుంటారు.

ఈ అఖండ దీపాన్నే 'నందాదీపం' అని కూడా పిలుస్తుంటారు. కష్టాల్లో ... బాధల్లో వున్న వాళ్లు 'నందా దీపం' మొక్కుని మొక్కుకుంటూ వుంటారు. ఒక మట్టి మూకుడులో నూనె పోసి ... పెద్ద వత్తివేసి .. ఆలయానికి చేరుకొని అక్కడి నందా దీపంలోని జ్యోతితో ఆ వత్తిని వెలిగిస్తుంటారు. అలా దీపం వెలిగించబడిన మట్టి పాత్రను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఇక తరతరాలుగా వెలుగుతోన్న ఈ నందాదీపాన్ని దర్శించడం వలన సమస్త దోషాలు నివారించబడతాయని చెబుతుంటారు. అలాంటి 'నందా దీపం' మనకి చెల్లాపూర్ లోని కృష్ణుడి ఆలయంలో కనిపిస్తుంది. మెదక్ జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి నందా దీపం రెండు వందల సంవత్సరాలపై నుంచి వెలుగుతూనే వుంది.

ఆలయం తలుపులు మూసి వున్న సమయంలోను, ప్రధాన ద్వారానికి చేయబడిన రంధ్రం గుండా ఈ దీపం కాంతి కనిపిస్తూనే వుంటుంది. దైవ దర్శనం కాని వాళ్లు ఈ దీప దర్శనంతో సంతృప్తి చెందుతారు. ఈ నందా దీపాన్ని దర్శించడం వలన ఆపదలు ... దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. మీసాలతో దర్శనమిచ్చే ఇక్కడి కృష్ణుడు మహిమాన్వితుడనీ, ఆయన అనుగ్రహంతో వెలుగుతోన్న అఖండ దీప దర్శనం సకల శుభాలను కలిగిస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News