ఎండిపోయిన బావిలో జలధార !

శ్రీపాద శ్రీవల్లభుడు ... నృసింహ సరస్వతి ... అక్కల్ కోట స్వామి ... శిరిడీ సాయిబాబా గురు పరంపరగా భక్తుల హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి కనిపిస్తారు. తమని విశ్వసిస్తోన్న భక్తులను ఆదుకోవడానికిగాను వాళ్లు చూపిన మహిమలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఏ మహిమను కూడా వాళ్లు తమ పేరు ప్రతిష్ఠల కోసం చేయలేదు. ఎవరి ప్రశంసలు ... అభినందనలు వాళ్లకి అవసరం లేదు కూడా.

ఒకరు నిరుపేదను రాజుగా చేస్తే ... మరొకరు అక్షరం ముక్క రానివానిచే వేదం చెప్పించారు. గొడ్డుగేదె పాలను ఇచ్చేలా ఒకరు చేస్తే ... ఇంకొకరు ఎండిన బావిలో జలధార పడేలా చేశారు. ఇలా వాళ్లు చూపిన మహిమలను గురించి భక్తులు ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు. ఎండిన బావిలో జలధారపడేలా చేసిన సంఘటన మనకి అక్కల్ కోట స్వామి మహిమలలో ఒకటిగా కనిపిస్తూ వుంటుంది.

ఒకసారి ఆయన ఒక వీధి గుండా వెళుతూ దాహంగా అనిపించడంతో, ఒక ఇంటిదగ్గర ఆగి ఆ ఇల్లాలిని మంచినీళ్లు అడుగుతాడు. మంచినీళ్లు అయిపోయాయనీ ... దూరంగా వెళ్లి తీసుకురావాలని ఆమె చెబుతుంది. అంత సమయం లేదనీ పెరట్లోని బావిలోంచి తోడి తీసుకురమ్మని అంటాడాయన. ఆ బావి ఎండిపోయి చాలాకాలం అయిందనీ, అందువల్లనే తాము బయట నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని ఆమె సమాధానమిస్తుంది.

ఒకసారి బావిలోకి చూసి ఆ మాట చెబితే తాను వెళ్లిపోతానని ఆయన అంటాడు. బావి దగ్గరికి వెళ్లి తొంగి చూసిన ఆమె ఆశ్చర్యపోతుంది. అంతకుముందేపడిన జలధారతో నీటిమట్టం పెరుగుతూ పైకి రావడం చూసిన ఆమె సంతోషంతో పొంగిపోతుంది. వెంటనే ఆ బావిలో నుంచి నీరు తోడి ఆ నీటితో ముందుగా స్వామివారి పాదాలను కడుగుతుంది. ఆ తరువాత దాహం తీర్చుకోవడానికి మంచినీటిని అందిస్తుంది. ఆ ఇల్లాలి భర్త ... మంచినీళ్ల కోసం తాము పడుతోన్న అవస్థలను గురించి మనసులో స్వామికి చెప్పుకోవడం వల్లనే ఆయన అలా కరుణించాడని అంటారు.


More Bhakti News