అదే నరక చతుర్దశి విశేషం
కొన్ని ప్రాంతాలలో ధన త్రయోదశి .. నరక చతుర్దశి .. బలిపాడ్యమి .. యమద్వితీయలను కలుపుకుని దీపావళి అయిదు రోజుల పండుగలా కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాలలో నరకచతుర్దశితోనే మొదలై దీపావళి .. బలిపాడ్యమితో మూడురోజుల పండుగగా దర్శనమిస్తుంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి 'నరకచతుర్దశి' గా చెప్పబడుతోంది.
లోక కంటకుడైన నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు వధించిన కారణమే ఈ రోజుకి గల విశేషమని కొందరు చెబుతుంటారు. ఇక నరకలోక బాధలను అనుభవించే పరిస్థితి తమకి రాకూడదనీ, ఒకవేళ తమ పూర్వీకులు నరకలోకంలో గనుక వుంటే అక్కడి నుంచి వాళ్లకి విముక్తి కలగాలని భావిస్తూ యమధర్మరాజుని పూజించే కారణంగా కూడా ఇది నరక చతుర్దశిగా పిలవబడుతోందని మరికొందరు చెబుతుంటారు.
నరకాసురుడు ఈ రోజు ఉదయాన సంహరించబడిన కారణంగా తలస్నానం చేయడం ... ఆ సంతోషంతో పిండివంటలు చేసుకోవడం ... మతాబులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ రోజున చేసే స్నానం విశేషమైన పుణ్యఫలాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున ... దీపావళి రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ... నీటిలో గంగ కొలువై ఉంటారట.
అందువలన ఈ రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో తలంటుకుని, స్నానం చేయడానికి ముందు ఔషధ గుణాలు కలిగిన ఉత్తరేణి .. తుమ్మి .. తగిరస చెట్ల కొమ్మలతో ఆ నీటిని కలుపుతారు. ఆ తరువాత యముడికి తర్పణం వదలడం ... ఆయనని పూజించడం చేస్తారు. ఈనాటి సాయంత్రం పితృదేవతలను తలచుకుని ఇంటిముందు దీపాలను వెలిగిస్తారు. ఇలా నరక చతుర్దశి ... నరకాసురుడి సంహారం జరిగిన కారణంగా జరుపుకునే సంతోషాల సంబరంగా కనిపిస్తుంది. నరకలోక బాధల నుంచి తమ పూర్వీకులకు విముక్తి కల్పించమని యమధర్మరాజుని ప్రార్ధించే విశేషమైన రోజుగా అనిపిస్తుంది.