సిద్ధామృత తీర్థాన్ని సేవిస్తే చాలట
పుణ్యక్షేత్రాలకి వెళ్లినవాళ్లు ముందుగా అక్కడి పుష్కరిణిని చేరుకుంటారు. ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆ తరువాత అక్కడి ప్రధాన దైవాన్ని దర్శించుకుంటారు. పుష్కరిణిలో స్నానం చేయడం వలన శరీరం ... మనసు రెండూ పవిత్రమవుతాయి.
కొన్ని క్షేత్రాల్లోని పుష్కరిణిలలో స్నానం చేయాలన్నా ... అందులోని నీటిని తీర్థంగా స్వీకరించాలన్నా జలచరాలు ఏవైనా ఉంటాయేమోనని కొంతమంది భయపడుతుంటారు. 'సిద్ధామృత పుష్కరిణి' విషయంలో ఇలా భయపడవలసిన పనిలేదట. ఎందుకంటే ఇందులో జలచరాలు ఉండవని చెబుతుంటారు.
తమిళనాడు ప్రాంతానికి చెందిన 'వైదీశ్వరన్' కోయిల్ ప్రాంగణంలో ఈ పుష్కరిణి దర్శనమిస్తుంది. శివుడు 'వైద్యనాథుడు' పేరుతో పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రంలో, ఈ పుష్కరిణి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ పుష్కరిణిలో ఎలాంటి జలచరాలు లేకపోవడానికి వెనుక గల ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ వుంటుంది.
పూర్వం ఈ పుష్కరిణి ఒడ్డునే కూర్చుని ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. ఈ పుష్కరిణిలోని జలచరాల కారణంగా ఒకసారి ఆయన తపస్సుకి భంగం కలుగుతుంది. ఆగ్రహావేశాలకి లోనైన ఆయన, ఇకపై ఈ పుష్కరిణిలో ఎలాంటి జలచరాలకి స్థానం లేదంటూ శపిస్తాడు. ఆ కారణంగానే ఇప్పటికీ ఇందులో జలచరాలు ఉండవని చెబుతుంటారు. మహిమాన్వితమైన ఈ పుష్కరిణి తీర్థాన్ని సేవించడం వలన పాపాలు ... వాటి ఫలితంగా కలిగే అనారోగ్యాలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు.