ధర్మం తప్పితే ఫలితం ఇలాగే వుంటుంది !
జీవితంలో ఎవరు అనుసరించడానికైనా మంచి - చెడు అనే రెండే మార్గాలు వుంటాయి. మంచిదికానిది ఏదైనా చెడే. చెడు అంటే ధర్మబద్ధమైనది కాదని అర్థం. ఇలా నడచుకోమంటూ పరమశివుడు ఏదైతే చెప్పాడో అదే ధర్మబద్ధమైనది. అందుకు విరుద్ధంగా నడచుకోవడం అధర్మం.
ధర్మబద్ధమైన మార్గంలో చేసే ప్రయాణం భగవంతుడి సమీపానికి చేరుస్తుంది. అధర్మ మార్గం అనేక కష్ట నష్టాలను ఫలితంగా ముట్టజెబుతుంది. అందుకు కీచకుడినే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అజ్ఞాతవాస కాలంలో పాండవులతో పాటు 'ద్రౌపతి' కూడా తన పేరును .. వేషధారణను మార్చుకుంటుంది. విరాటరాజు భార్య 'సుధేష్ణాదేవి ' చెంత 'సైరంధ్రి' పేరుతో దాసీగా చేరుతుంది.
సుధేష్ణాదేవి సోదరుడైన 'కీచకుడు' సైరంధ్రి అందచందాలను చూసి మనసు పారేసుకుంటాడు. ఆమెని పొందడానికి అనేక ప్రయత్నాలు చేయసాగాడు. అతని దురుద్దేశాన్ని గ్రహించిన సైరంధ్రి, తనకి వివాహమైందనే విషయాన్ని చెబుతుంది. పతివ్రతలకు దూరంగా వుండటం అన్నివిధాలా మంచిదని అంటుంది. కామవికారాలకులోనై ధర్మం తప్పినవాళ్లు ఎలాంటి ఫలితాలను పొందారో ఒకసారి ఆలోచన చేయమని చెబుతుంది.
అయినా ఆ హితవాక్యాలను ఆయన పట్టించుకోకుండా ఆమెను మరింతగా ఇబ్బందిపెడుతూ వుంటాడు. ఆయన ధోరణి గురించి విరాటరాజుతోగానీ ... సుధేష్ణాదేవితో గాని చెప్పడం వలన ప్రయోజనం ఉండదని భావించిన ద్రౌపతి, విషయాన్ని భీముడి దృష్టికి తీసుకువెళుతుంది. భీముడు ఇచ్చిన సలహా ప్రకారం, ఫలానా సమయానికి మందిరానికి రమ్మంటూ కీచకుడిని ఆహ్వానిస్తుంది.
తన విషయంలో ఆమె మనసు మార్చుకుందని భావించిన కీచకుడు, ఓ రాత్రివేళ ఆ మందిరంలోకి అడుగుపెడతాడు. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న భీముడు ఒక్కసారిగా కీచకుడిపై విరుచుకుపడతాడు. ఊహించని ఈ సంఘటనకి కీచకుడు బిత్తరపోతాడు. భీముడి పిడిగుద్దుల బారి నుంచి తప్పించుకోలేక అక్కడే కుప్పకూలిపోతాడు. అలా బుద్ధి పెడదోవ పట్టిన కారణంగా భీముడి చేతిలో కీచకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మితిమీరిన కామంతో ధర్మం తప్పడం వలన అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాడు.