దైవ పరీక్షకు నిలిచేవాడే నిజమైన భక్తుడు
తుకారామ్ కి పాండురంగస్వామి ఆలోచన మినహా మరో ధ్యాస వుండేది కాదు. ఎప్పుడు చూసినా ఆ స్వామి రూపాన్ని ఊహించుకుంటూ ... ఆయన లీలా విశేషాలను కీర్తిస్తూ ఉండేవాడు. పాటలు పాడుకుంటూ కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుందంటూ ఆయన భార్య అసహనాన్ని ప్రదర్శిస్తుంది. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించమంటూ తాను దాచుకున్న కొంత సొమ్మును ఆయనకి ఇస్తుంది.
భగవంతుడిని ఆరాధించడమే తప్ప తనకి వ్యాపార రహస్యాలు తెలియవని తుకారామ్ ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోదు. ఉన్న సొమ్ముతో పక్క ఊరు నుంచి బట్టలు కొనుక్కొచ్చి, తమ ఊరు సంతలో లాభానికి అమ్మమని చెబుతుంది. తప్పనిసరి పరిస్థితి అనిపించడంతో తుకారామ్ ఆ సొమ్ముతో పక్కనే వున్న మరో ఊరుకి వెళతాడు.
అక్కడ ఒక వ్యక్తిని రాజభటులు శిక్షిస్తూ వుండటం ఆయన కంట పడుతుంది. రాజభటులను అడ్డుకుని విషయమేమిటని అడుగుతాడు. ఆ వ్యక్తి ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్మును చెల్లించకపోవడమే అందుకు కారణమని వాళ్లు చెబుతారు. ఒక వ్యక్తిని వాళ్లు అలా శిక్షిస్తూ వుంటే ఏమీ పట్టనట్టుగా ఎవరికి వాళ్లు తమ పనులను తాపీగా చేసుకుపోతుండటం తుకారామ్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇలాంటి దృశ్యాన్ని చూస్తూ తాను కూడా అక్కడి నుంచి వెళ్లిపోతే, పాండురంగడికి ఏమని సమాధానం చెప్పుకోవాలని అనుకుంటాడు. ఆ వ్యక్తిని వదిలేయమనీ ... ఆ సొమ్మును తాను ఇస్తానని అంటాడు తుకారామ్. వ్యాపారాన్ని ఆరంభించమంటూ తన భార్య ఇచ్చిన సొమ్మును రాజభటుల చేతిలో ఉంచుతాడు.
శిక్ష నుంచి బయటపడిన ఆ వ్యక్తి తుకారామ్ లో దేవుడిని చూస్తూ నమస్కరిస్తాడు. ఎన్ని వ్యాపారాలు చేసినా సంపాదించుకోలేని ఆత్మ సంతృప్తిని తనకి కలిగించిన పాండురంగడికి తుకారామ్ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. భగవంతుడు పెట్టిన ఆ పరీక్షలో తనకి తెలియకుండానే తుకారామ్ గెలుస్తాడు. ఇలా ఎన్నో పరీక్షలకు నిలిచిన కారణంగానే తుకారామ్ సశరీరంతో వైకుంఠానికి వెళ్లాడు.