భక్తాంజనేయుడిని భక్తితో వేడుకుంటే చాలు

రామ అనే శబ్దం నోటివెంట నుంచి రాగానే రాముడు పలుకుతాడు. కానీ అప్పటికే హనుమంతుడు ఆ నామాన్ని పలికినవారి పక్కన వుంటాడు. అది రాముడి పట్ల ఆయనకి గల భక్తి ... ఆయన నామాన్ని స్మరించే భక్తులపట్ల గల అభిమానం. రాముడిని ఆరాధించేవారి నుంచి మాత్రమే హనుమంతుడు పూజలు స్వీకరిస్తాడు. రామ దర్శనం కోసం తపించేవారికి ఆయన దర్శనభాగ్యాన్ని కల్పిస్తాడు.

అలా తాను భక్తుడై తరిస్తూ .. తన భక్తులను తరింపజేసే ప్రత్యేకమైన స్థానంలో హనుమంతుడు కనిపిస్తాడు. అలా ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాల్లో ఒకటి 'పాలకీడు'లో అలరారుతోంది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో గల ఈ గ్రామంలో ప్రాచీనకాలంనాటి హనుమంతుడి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామివారు 'భక్తాంజనేయుడు'గా భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు.

ఆలయ నిర్మాణశైలిని పరిశీలిస్తే ఇది కాకతీయుల కాలానికి పూర్వమే నిర్మించబడినదిగా అనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో 'దేవనాగరి లిపి'లో శిలా శాసనం కనిపిస్తుంది. బహుశా ఆలయ వివరాలు ఇందులో పొందుపరచబడి ఉండవచ్చు. ఆలయం గురించిన పూర్తి సమాచారం వెలుగులోకి రావడానికి ఈ శాసనం ఎంతగానో దోహదపడుతుంది.

ప్రతి మంగళవారం స్వామివారికి సిందూర అభిషేకాలు ... ఆకుపూజలు జరుగుతుంటాయి. పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగానే వుంటుంది. ఇక్కడి హనుమంతుడిని అంకితభావంతో వేడుకుంటే చాలు, కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News