ఈ గుట్టపైన ఇదో విచిత్రం !

వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు అనేక ప్రాంతాల మీదుగా ప్రయాణం సాగించారు. అక్కడక్కడా కొన్ని ప్రదేశాల్లో కొన్నిరోజుల పాటు ఉండిపోయారు. అప్పట్లో అంతా అడవీ ప్రాంతంగా ఉండటం వలన, తాము ఉండటానికి ఎత్తయిన గుట్టలు అనుకూలమైనవిగా వాళ్లు భావించేవాళ్లు. క్రూరమృగాలు ఆ గుట్టలపైకి రాకుండా లక్ష్మణుడు కాపలాకాస్తూ ఉండేవాడు.

అలా వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు కొంతకాలం పాటు నివసించిన గుట్ట ఒకటి మనకి 'జుంటుపల్లి' లో దర్శనమిస్తుంది. రంగారెడ్డి జిల్లా తాండూరు మండల పరిధిలో గల ఈ గ్రామంలో ఈ గుట్ట కనిపిస్తూ ఉంటుంది. చాలాకాలం క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తుడికి కలలో శ్రీరాముడు కనిపించి, ఫలానా ప్రదేశంలో తన మూర్తి ఉందనీ, దానిని ఇక్కడి గుట్టపై ప్రతిష్ఠించి పూజాభిషేకాలు జరిగేలా చూడమని ఆదేశించాడట.

ఆ ఆనవాళ్ల ప్రకారం ఆ భక్తుడు స్వామివారి మూర్తిని కనుగొని, ఈ గుట్టపై ఆలయాన్ని నిర్మించి అందులో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి శ్రీరాముడి పాద భాగం నుంచి 'జల' ఊరుతూనే ఉందట. ఈ సన్నటి జలధార ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు. స్వామివారి మహిమే ఇందుకు కారణమని భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఈ పాద తీర్థాన్ని స్పర్శించినా చాలు సమస్త పాపాలు నశిస్తాయని విశ్వసిస్తుంటారు.

సీతారామ లక్ష్మణులు ఈ గుట్టపై ప్రత్యక్షంగా సంచరించడం ... తన ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించి పూజించమని స్వప్నంలో స్వామి చెప్పడం ... స్వామివారి పాదాల నుంచి నీళ్లు ఊరుతూ ఉండటం వలన ఇది మహిమాన్వితమైన క్షేత్రమని చెప్పబడుతోంది.


More Bhakti News