అదే ధన త్రయోదశి విశిష్టత !
నారాయణుడు ఎక్కడైతే పూజించబడుతూ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువై ఉండటానికి ఆసక్తిని చూపుతుందో అక్కడే నారాయణుడు స్థిరనివాసం ఏర్పరచుకుంటాడు. లక్ష్మీనారాయణులు ఎవరి ఇంట కొలువుదీరి ఉంటారో, ఆ ఇల్లు సకల శుభాలకు పుట్టినిల్లుగా మారిపోతుంది. ఆ ఇంట్లోని వారంతా సుఖసంతోషాలతో కళకళలాడుతూ వుంటారు.
సాధారణ రోజుల్లోనే వాళ్ల అనుగ్రహం ఇలా వుంటే, ఇక అమ్మవారికి స్వామివారు స్వేచ్ఛ కల్పించిన రోజున ... 'ధన్వంతరి' గా ఆయన అవతరించిన రోజున వాళ్లను ఆరాధిస్తే కలిగే ఫలితం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. ఈ రెండు సంఘటనలు జరిగిన విశేషమైన రోజే 'ధన త్రయోదశి' గా చెప్పబడుతోంది. 'ఆశ్వయుజ బహుళ త్రయోదశి'యే ధనత్రయోదశిగా పిలవబడుతోంది.
నరకుడి చెరలో వున్న అమ్మవారికి శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించి, కామధేనువు పాలతో అభిషేకించి 'ధనలక్ష్మి' గా అమ్మవారిని పట్టాభిషిక్తురాలిని చేసి ఆమెకి సంతోషాన్ని కలిగించిన రోజు ఇదే. ఇక లోక కల్యాణం కోసం ధన్వంతరిగా శ్రీమన్నారాయణుడు అవతరించిన రోజు కూడా ఇదే. ఈ రోజున ఇంటిముందు ముగ్గు పెట్టి .. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ... గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి.
పూజా మందిరంలో లక్ష్మీదేవి ప్రతిమను కానీ ... చిత్రపటాన్ని గాని పూలమాలికలతో అలంకరించాలి. అమ్మవారికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానం పలుకుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారు సిరిసంపదలను ప్రసాదిస్తుందని చెప్పబడుతోంది. ఇక ధన్వంతరి జయంతిగా చెప్పబడుతోన్నఈ రోజున స్వామిని పూజించడం వలన, వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యం కాపాడబడుతూ ఉంటుంది.
ఈ రోజున ఎవరైతే లక్ష్మీ నారాయణులను పూజిస్తారో, వారి ఇంటివైపు యమధర్మరాజు కన్నెత్తి కూడా చూడలేడట. ఈ విషయంలో ఆయనకి ఆగ్రహం కలగకుండా ఉండటం కోసం ఆయనని శాంతింపజేస్తూ కొన్ని ప్రాంతాలలో ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. ఆయన శాంతించడం వలన ఆయుష్షు పెరుగుతుందని భావిస్తుంటారు. ఈ కారణంగా ఇది 'యమత్రయోదశి'గా కూడా పిలవబడుతోంది. అలా ఆయురారోగ్యాలను ... ఐశ్వర్యాన్ని ప్రసాదించేదిగా ధన త్రయోదశి తన విశిష్టతను చాటుకుంటోంది.