భగవంతుడి సన్నిధిలో లభించేదే సంతోషం
భగవంతుడి గురించిన ఆలోచన సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన లీలావిశేషాలను తలచుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది. భగవంతుడి దర్శనం ... అనునిత్యం ఆయన సన్నిధిలో గడపడం అసలైన సంతోషాన్ని కలిగిస్తుంది. భగవంతుడి సేవలో తరించేవారు, ఆయన చూపిన మార్గంలో నడిచేవారు రానున్న ఆపదలను తలచుకుని బాధపడరు ... భయపడరు.
తమకి కష్టమేరానీ ... నష్టమేరాని అన్నీ ఆయనే చూసుకుంటాడనే అపారమైన విశ్వాసంతోనే వాళ్లు సంతోషంగా వుంటారు. భగవంతుడి ద్వారా పొందే సంతోషానికి ఏవి ఆటంకమని అనుకుంటారో వాటిని వదులుకోవడానికి కూడా వాళ్లు సిద్ధంగా వుంటారు. భగవంతుడితో ఉండే బంధమే శాశ్వతమని విశ్వసిస్తుంటారు. ఎంతోమంది మహా భక్తుల జీవితాలు ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంటాయి.
పోతన ... త్యాగయ్య ... అన్నమయ్య వంటివారు భగవంతుడిని కీర్తించడంలో గల సంతోషానికి సంపదలు సాటిరావని చెప్పారు. ఇక భగవంతుడి యొక్క మహాత్మ్యాన్ని అర్థం చేసుకున్న పురందరదాసు తన సంపదలను పేదలకు పంచి, కట్టుబట్టలతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించాడు. బంధాల ద్వారా బాధలు మాత్రమే మిగులుతాయని తెలుసుకున్న క్షేత్రయ్య, ఆ క్షణం నుంచి మొవ్వ గోపాలస్వామిని కీర్తిస్తూ తన జన్మను చరితార్థం చేసుకున్నాడు.
'హరి' నామాన్ని ఆశ్రయించిన ప్రహ్లాదుడు ... శ్రీరాముడి పాద సేవను ఆశించిన రామదాసు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా, దైవ నామస్మరణ ద్వారా తాము పొందే సంతోషానికి దూరం కాలేదు. ఇలా ఎంతోమంది మహా భక్తులు భగవంతుడి సన్నిధిలో లభించేదే అసలైన సంతోషమని ఈ లోకానికి చాటి చెప్పారు.