సమస్త దేవతలు ఇక్కడ సంచరించారట !

భగవంతుడు ఆవిర్భవించిన పవిత్రమైన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ఈ క్షేత్రాలను దర్శించినప్పుడు ... అక్కడి దైవానికి ఆ ప్రదేశంతో గల అనుబంధం గురించి తెలుస్తూ ఉంటుంది. మహర్షులు ... మహాభక్తుల కోరిక మేరకు భగవంతుడు ఆయా ప్రాంతాలలో వెలిసినట్టు స్థల పురాణాలను బట్టి తెలుస్తూ వుంటుంది.

అలాగే లోక కల్యాణం కోసం కూడా భగవంతుడు ఆయా ప్రాంతాలలో కొలువుదీరినట్టు చెప్పబడుతోంది. తాను ఉండదలచుకున్న ప్రదేశంలో ఆ దేవుడు తిరుగాడటం సహజం. ఇక అక్కడ కొలువైన స్వామిని దర్శించుకోవడానికి దేవతలంతా వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలా దేవతలు దిగివచ్చి ఒకేచోట కొలువైన ప్రదేశంగా 'వేములవాడ' కనిపిస్తుంది.

కరీంనగర్ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో పరమశివుడు 'రాజరాజేశ్వరుడు'గా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. నారద మహర్షి అభ్యర్థన మేరకు సదాశివుడు అమ్మవారితో కలిసి ఇక్కడ ఆవిర్భవించినట్టు చెప్పబడుతోంది. కైలాసంలో స్వామివారి జాడ లేకపోవడంతో సమస్త దేవతలు ఈ ప్రదేశానికి తరలివచ్చి, కొంతకాలంపాటు ఇక్కడే ఉండి స్వామివారిని సేవించుకుంటారు.

దేవుళ్లు కొలువుదీరిన కారణంగా ఈ ప్రదేశానికి 'దేవుళ్ల వాడ' అనే పేరు వచ్చిందనీ, కాలక్రమంలో అది 'వేములవాడ'గా మార్పు చెందిందని అంటారు. ఇప్పటికీ కూడా దేవతలు అదృశ్య రూపంలో వచ్చి ఇక్కడి స్వామివారిని సేవిస్తూ ఉంటారని భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి స్వామివారిని దర్శించుకున్నవారి కష్టాలు ఆ క్షణంలోనే తొలగిపోతాయని బలంగా చెబుతుంటారు.


More Bhakti News