కృష్ణదేవరాయలు తెలుసుకున్న మహిమ !
శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో దేవాలయాలను నిర్మించాడు. మరెన్నో ఆలయాల అభివృద్ధికి కృషి చేశాడు. వివిధ క్షేత్రాలను దర్శించి అక్కడి దైవానికి భారీగా కానుకలను సమర్పించుకునేవాడు. అలాంటి కృష్ణదేవరాయలు మారుమూల ప్రాంతంలో వున్న ఒక క్షేత్ర మహిమను గురించి విని, ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నాడు.
'పెదకాకాని'గా పిలవబడుతోన్న ఆ క్షేత్రం గుంటూరు జిల్లాలో విలసిల్లుతోంది. ఇక్కడ భ్రమరాంబ సమేత మల్లేశ్వరుడు కొలువై భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు. ఈ స్వామిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో వేడుకున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వసిస్తుంటారు.
ఈ విషయాన్ని గురించి తెలుసుకున్న కృష్ణ దేవరాయలు, స్వామివారిని దర్శించుకుని పుత్ర సంతానం కావాలని కోరుకున్నాడట. ఈ క్షేత్రం నుంచి తిరిగి వెళ్లిన కొంతకాలానికే రాణిగారు గర్భాన్ని ధరించడం ... మగబిడ్డకి జన్మనివ్వడం జరిగిందట. దాంతో ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని భావించిన కృష్ణదేవరాయలు, ఇక్కడి స్వామివారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు చూపించేవాడట.
సంతానలేమితో బాధలు పడుతోన్నవాళ్లు ఇప్పటికీ ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివారి దర్శనం చేసుకుని ఆయనకి తమ మనసులోని మాటను చెబుతుంటారు. తమ కోరిక నెరవేరగానే కృతజ్ఞతా పూర్వకంగా మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు.