ప్రశాంతతను ప్రసాదించే సాయి దివ్యక్షేత్రం

భగవంతుడు కొలువుదీరిన కారణంగానేమో ఆలయంలోకి అడుగుపెట్టగానే ప్రశాంతత లభిస్తుంది. భగవంతుడి సన్నిధిలో లభించే ఆ ప్రశాంతత కోసమే ఆలయాలకి వెళుతూ వుండటం జరుగుతుంది. సాధారణంగా ఎవరైనా భగవంతుడికే తమ కష్టం చెప్పుకుంటూ వుంటారు.

కష్టాలను పడుతున్న మనసెప్పుడూ ఆవేదనతో నిండి వుంటుంది. అలాంటి మనసుపై ఆలయ వాతావరణం ఎంతగానో ప్రభావం చూపుతుంది .. వాళ్ల మనసుకు ఎంతో ఊరట కలిగిస్తుంది.అలాంటి వాటిలో 'సాయిసుందర రామదాస మందిరం' ఒకటిగా కనిపిస్తుంది. ఇది నల్గొండ జిల్లా 'నేలకొండపల్లి' లో దర్శనమిస్తుంది.

సత్యసాయి - శిరిడీసాయితో పాటు రామభక్తుడైనటువంటి 'రామదాసు' కొలువై వుండటం ఈ మందిరం ప్రత్యేకత. ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడంలోను ... వారికి సేవలను అందించడంలోను శిరిడీసాయి - సత్యసాయి ఎవరి పద్ధతిని వాళ్లు అనుసరించారు. భక్తుల హృదయాలలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

అలాంటి మహనీయుల మూర్తులను ఒకే ప్రాంగణంలో దర్శించుకోవడం అదృష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక భద్రాచల ఆలయ నిర్మాణంలో ప్రధానమైన పాత్రను పోషించి, ఆ రామచంద్రుడి మనసును గెలుచుకున్న రామదాసు ఈ నేలకొండపల్లికి చెందినవాడే. ఆయన ప్రతిమను కూడా ఇక్కడ దర్శించుకుని పూజించుకునే అవకాశం కలుగుతుంది.

సువిశాలమైన ప్రదేశంలో రెండు అంతస్తులుగా నిర్మించబడిన ఈ ఆలయంలో, క్రింది అంతస్తు ధ్యాన మందిరంగా కనిపిస్తుంది. పవిత్రతకు ... ప్రశాంతతకు ప్రతీకగా కనిపించే ఈ ఆలయ దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News