శివాలయంలో దీపం వెలిగిస్తే కలిగే ఫలితం !
పండు సమర్పించుకోలేని వాళ్లు పత్రం సమర్పించినా, బంగారు శివలింగాన్ని పూజించలేని వాళ్లు మట్టితో తయారు చేసుకున్న శివలింగాన్ని పూజించినా ఒకే విధమైన పుణ్యఫలితాలను ఇచ్చే దైవంగా పరమశివుడు కనిపిస్తాడు. ఆదిభిక్షువు అనిపించుకున్న ఆయన అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. గుండెలనిండా ప్రేమతో ఎవరు ఏది సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తూ వుంటాడు.
అనునిత్యం తనని పూజించే అవకాశం లేనివారిని అనుగ్రహించడం కోసం కొన్ని రోజులు విశిష్టతను ... విశేషాన్ని సంతరించుకునేలా చేశాడు. ఆ రోజున తన ఆరాధనా విధానాన్ని మరింత సులభతరం చేసి అనంతమైన పుణ్యఫలితాలను అందిస్తుంటాడు. అలాంటి విశేషమైన రోజుగా 'మాసశివరాత్రి' కనిపిస్తుంది.
సాధారణ రోజుల్లోనే 'ప్రదోష సమయం'లో శివుడిని పూజించడం వలన విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక ఈ రోజున ప్రదోష సమయంలో శివుడిని అర్చించడం వలన కలిగే పుణ్యం అత్యధికంగా ఉంటుందట. ఈ రోజు ఉదయం నుంచి ఉపవాస దీక్షను చేపట్టి, ప్రదోష కాలంలో శివుడిని అభిషేకించి మారేడు దళాలతో పూజించవలసి ఉంటుంది.
శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో దీపం వెలిగించాలి. పరమశివుడిని అనేక విధాలుగా కీర్తిస్తూ ... స్మరిస్తూ జాగరణ చేయాలి. ఈ రోజున చేసే జాగరణ వలన ... శివాలయంలో దీపం వెలిగించడం వలన కలిగే పుణ్యం అనేక జన్మలపాటు వెంట వస్తుందని చెప్పబడుతోంది.