ఈ నియమం పాటిస్తే కోరిక నెరవేరుతుందట !
భగవంతుడు ఆయా క్షేత్రాల్లో ఆవిర్భవించడానికి అనేక కారణాలు వుంటాయి. ఆయన ఎక్కడ కొలువైనా .. అక్కడికి చేరుకోవడం ఎంత కష్టమైనా భక్తులు బయలుదేరుతూనే వుంటారు. అక్కడి దైవాన్ని దర్శించి ఆశీస్సులు అందుకుంటూనే వుంటారు.
భగవంతుడిని దర్శించిన ప్రతి ఒక్కరూ తమ మనసులోని మాటను ఆయనకి చెప్పుకుంటూనే వుంటారు. ఆ కోరిక నెరవేరేలా చేయవలసిన బాధ్యత ఆయనదేనంటూ ఆ క్షణమే ఆ పనిని ఆయనకి అప్పగించేస్తారు. భగవంతుడు అందరి కష్టాలను వింటాడు ... ధర్మబద్ధమైన వారి కోరికలను నెరవేర్చడానికి తనవంతు కృషిచేస్తాడు.
అయితే అందుకు ఓ నియమం వుంటుంది. ఆ నియమం ప్రకారం నడచుకున్నవారి కోరికలు మాత్రమే ఆయన నెరవేరుస్తూ వెళతాడు. భగవంతుడి పట్ల విశ్వాసం ... ఆధ్యాత్మిక చింతనను పెంచే విధంగా వుండే ఈ నియమం ఒక్కో క్షేత్రంలో ఒక్కోలా కనిపిస్తూ వుంటుంది. 'ఎద్దులకొండ' లోను మనకి ఇలాంటి నియమమే కనిపిస్తుంది. కడప జిల్లా 'వేంపల్లె' సమీపంలో ఈ కొండ దర్శనమిస్తూ వుంటుంది.
ఇక్కడి స్వయంభువు వేంకటేశ్వరుడు పద్మావతీదేవి సమేతుడై 'వృషభాచలేశ్వరుడు' గా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఈ స్వామి సన్నిధికి చేరుకొని ధర్మబద్ధమైన ఏ కోరిక కోరినా అది తప్పక నెరవేరుతుందని చెబుతుంటారు. అయితే అందుకు పదకొండు శుక్రవారాల పాటు మానసిక దీక్షను చేపట్టాలి. ప్రతి శుక్రవారం స్వామివారి గర్భాలయానికి పదకొండు ప్రదక్షిణలు చేయవలసి వుంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నియమాన్ని పాటిస్తూ స్వామివారిని ఆరాధించడం వలన అనతికాలంలోనే కోరికలు నెరవేరతాయని చెబుతుంటారు.