గురువు ఆజ్ఞను గౌరవించిన వీరశివాజీ

అచెంచలమైన దేశభక్తి ... అసమానమైన దైవభక్తి చత్రపతి శివాజీ సొంతం. సాహసం ... సహనం, వీరత్వం ... వినయం, గభీరం ... ప్రశాంతత సమపాళ్లలో సంతరించుకున్న రూపంగా శివాజీ కనిపిస్తుంటాడు. భవానీదేవి భక్తుడైన ఆయన శత్రువులపై తప్ప మరొకరిపై కన్నెర్రజేసిగానీ, కఠినంగా మాట్లాడిగాని ఎరుగడు.

కళాకారులను ... భక్తులను ఆదరించడంలో ఆయనకి ఆయనే సాటి. పిరికితనాన్ని ... అహంకారాన్ని ఆయన దరిదాపుల్లోకి కూడా రానిచ్చేవాడు కాదు. ఆధ్యాత్మిక చింతనవైపు ఆయన మనసు ఎక్కువగా లాగుతూ వుండేది. అలాంటి పరుస్థితుల్లోనే ఆయన ఒకసారి ఆధ్యాత్మిక గురువైన 'సమర్థ రామదాసు'ని కలుసుకుంటాడు.

తనకి ఆయన శిష్యరికం చేయాలనీ ఉందనీ, ఆశ్రమ జీవితాన్ని గడపాలని వుందని చెబుతాడు. శివాజీ పట్ల ఆయనకి కొంత చనువు ఉన్నప్పటికీ, ఏమీ మాట్లాడకుండా మూడు వస్తువులను ఆయన చేతికి ఇచ్చి బయలుదేరమని చెబుతాడు. ఆ వస్తువుల్లోనే సమర్థులవారి సమాధానం దాగి వుందని తెలుసుకున్న శివాజీ తన అంతఃపురానికి చేరుకుంటాడు.

గురువుగారు చెప్పదలచుకున్న సమాధానమేమిటనేది ఎంతగా ఆలోచించినా ఆయనకి అర్థం కాలేదు. అదే సమయంలో అటుగా వచ్చిన తల్లి ఆయన అదోలా వుండటం చూసి విషయమేమిటని అడుగుతుంది. తాను సమర్థులవారి ఆశ్రమానికి వెళ్లివచ్చిన సంగతి చెబుతూ, ఆయన ఇచ్చిన వస్తువులను ఆమె ముందుంచుతాడు.

ఆ వస్తువులను జిజియాబాయి పరిశీలనగా చూసి ''ప్రభువుగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడటమే అతని విధి'' అనేదే సమర్థులవారి సమాధానమని చెబుతుంది. ఆశ్చర్యచకితుడైన శివాజీ తల్లి పాదాలకి నమస్కరిస్తాడు. సమర్థులవారి ఆజ్ఞను తప్పక పాటిస్తానంటూ తనకి మార్గనిర్దేశం చేసిన గురువుకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుతాడు.


More Bhakti News