గుర్రంపై తిరిగే నరసింహస్వామి !
సాధారణంగా లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలుగా గుట్టలు ... కొండగుహలు కనిపిస్తుంటాయి. సింహం రూపాన్ని ధరించడం వలన ఆయన ఆ ప్రదేశాలను ఎంచుకోవడం జరిగింది. ఇక ఉగ్రమూర్తిగా ఆయన ఆవిర్భవించడం వలన ఆ ప్రదేశాలు విపరీతమైన వేడిగా అనిపిస్తూ వుంటాయి.
లక్ష్మీనరసింహస్వామి కొలువైన ఒక్కో క్షేత్రం ఒక్కో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆ స్వామికి సంబంధించిన ఒక క్షేత్రంలో మూసివేయబడిన ఒక బిలం నుంచి అప్పుడప్పుడు గంటల ధ్వని వినిపిస్తూ వుంటుంది. మరోక్షేత్రంలో స్వామివారు కొలువైన కొండపై నుంచి రాత్రి సమయాల్లో సింహగర్జనలు వినిపిస్తూ వుంటాయి.
అలాగే వరంగల్ జిల్లా 'గీసుకొండ'లోని లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయని భక్తులు చెబుతుంటారు. స్వామి తెల్లని గుర్రంపై విహరిస్తూ ఉంటాడని స్థానికులు విశ్వసిస్తుంటారు. చాలాకాలం క్రితం ఇక్కడి స్వామివారిని అర్చించే ఒక పూజారి స్వామివారు గుర్రంపై తిరుగుతూ ఉండటాన్ని చూశాడట.
ఆ కాలంలోనే మరికొందరికి కొండపై తిరుగుతూ తెల్లని గుర్రం మాత్రమే కనిపించిందట. వెంటనే కొండపైకి చేరుకొని చూడగా అది అక్కడ ఉండేదికాదట. ఆ తరువాత కూడా అప్పుడప్పుడు ఈ ఆలయ పరిసరాల్లో గుర్రపు డెక్కల ముద్రలు కనిపించేవని చెబుతుంటారు. ఈ కారణంగానే స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని విశ్వసిస్తుంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల శుభాలు చేకూరతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.