విజయాలను ప్రసాదించే అమ్మవారు

వెలుగు ... చీకటి మాదిరిగానే జీవితంలో మంచి చెడులు కనిపిస్తూ వుంటాయి. ఏ మార్గంలో ప్రయాణించాలనేది ఆయా వ్యక్తుల ఆలోచనా విధానాన్ని బట్టి వుంటుంది. ఎవరు ఎంచుకున్న మార్గాన్నిబట్టి వాళ్లు సుఖదుఃఖాలను అనుభవిస్తూ వుంటారు. అయితే ఏది మంచి ... ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతీ అమ్మవారే.

ఆ తల్లి అనుగ్రహం లభించినవాళ్లు జ్ఞానాన్ని పొందుతారు. నిజానిజాలు తెలుసుకుంటూ తమని తాము తీర్చి దిద్దుకుంటూ ముందుకు సాగుతుంటారు. అనుకున్న రంగాల్లో ఆశించిన స్థాయికి ఎదుగుతారు. వెలుగులో వాస్తవాన్ని గుర్తించడానికీ ... గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం వుంటుంది. అలాంటి వెలుగుబాటను చూపే జ్ఞానాన్ని తన భక్తులకు ప్రసాదించడం కోసం అమ్మవారు అనేక ప్రాంతాలలో ఆవిర్భవించింది.

అలాంటి క్షేత్రాల్లో ఒకటి వరంగల్ భద్రకాళీ దేవాలయానికి సమీపంలో కనిపిస్తుంది. 'జ్ఞాన సరస్వతి' గా పిలవబడుతోన్న ఇక్కడి అమ్మవారు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. ఇక్కడి అమ్మవారిని దర్శించి అంకిత భావంతో పూజించడం వలన, తమకి సంబంధించిన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి చెందడం జరుగుతుందట.

అమ్మవారి దర్శన భాగ్యం వలన విద్యార్థులు ఉత్తీర్ణతను ... ఉద్యోగులు పదోన్నతి సాధిస్తుంటారని చెబుతుంటారు. ఇక అమ్మవారి దర్శనం చేసుకుని ఏ కార్యం నిమిత్తం వెళ్లినా అది విజయవంతమవుతుందని అంటారు. దేవీ నవరాత్రులలో వచ్చే మూలా నక్షత్రం రోజున ... శ్రీపంచమి రోజున ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా అంతా అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులు అందుకుంటూ వుంటారు .. ఆనందానుభూతులను పొందుతుంటారు


More Bhakti News