ఈ ఆంజనేయుడి ఆశీస్సులుంటే చాలు !
సాధారణంగా ఎవరైనా బలంగా ... శౌర్య పరాక్రమాలను కలిగి వుంటే వాళ్ల వైపు చూడటానికే భయపడుతుంటారు. ఇక అలాంటి వాళ్లు అష్టసిద్ధులు పొందారని తెలిస్తే వాళ్ల గురించిన ఆలోచన కూడా రాకుండా చూసుకుంటారు. అలాంటిది మహాబల సంపన్నుడు ... అష్టసిద్ధులను పొందినవాడు అయిన హనుమంతుడిని మాత్రం అంతా ఇష్టపడుతుంటారు.
హనుమంతుడి చల్లని నీడలో తాము హాయిగా ఉండవచ్చని భక్తులు భావిస్తుంటారు. హనుమంతుడు ఎంతటి శక్తిమంతుడో అంతటి వినయ విధేయతలను కలిగి ఉండటమే అందుకు కారణం. అసలైన ఆదర్శానికి ఆనవాలుగా ఆయన జీవితం కనిపిస్తూ వుంటుంది. అలాంటి హనుమంతుడి పట్ల భక్తులు పెంచుకున్న ప్రేమానురాగాలకు ప్రతీకగా ఆయన ఆలయాలు కనిపిస్తూ వుంటాయి.
అలాంటివాటిలో ఒకటి వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం 'బీమారం' రహదారిలో దర్శనమిస్తుంది. భక్తుల సంకల్ప బలం కారణంగా ఇక్కడ దాసాంజనేయస్వామి దర్శనమిస్తూ వుంటాడు. కుదురుగా కనిపించే ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించేవాళ్లు ఈ స్వామివారితో చెప్పుకుని ఆయన ఆశీస్సులు తీసుకుంటూ వుంటారు.
ఈ విధంగా చేయడం వలన ఆ పని విజయవంతమవుతుందని చెబుతుంటారు. ఎంతో మంది అనుభవాలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ వుంటాయి. ప్రతి మంగళ - శని వారాల్లోను ... పర్వదినాల్లోను ప్రత్యేక పూజలు .. సేవలు జరుగుతూ వుంటాయి. ఈ సందర్భంగా స్వామిని దర్శించిన భక్తులు ఆయన ఆశీస్సులు అందుకుంటూ వుంటారు ... మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వుంటారు.