కేతు గ్రహదోషం ఇలా తొలగిపోతుందట !
నవగ్రహాలలో ఏ గ్రహ దోషమైనా కొన్నిరకాల ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జాతకంలో 'కేతువు' ప్రతికూలంగా ఉండటం వలన కూడా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా కేతువు కొన్నిరకాల వ్యాధులకు గురిచేస్తూ వుంటాడు. ఆ వ్యాధుల వలన భరించలేని బాధలను అనుభవించ వలసి వస్తుంది. ఆ అనారోగ్యం బారి నుంచి బయటపడితే చాలు ... అదే పదివేలు అనిపిస్తుంది.
ఇక తలపెట్టిన కార్యాలకు కేతువు అనేక రకాలుగా ఆటంకాలు కలిగిస్తూ వుంటాడు. దాంతో నిరాశా నిస్పృహలు అలుముకుంటూ వుంటాయి. ఎంతకాలం ఇలా బాధలు పడవలసి ఉంటుందోననే ఆందోళన మనసుకి ప్రశాంతత లేకుండా చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే కేతువును ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. కేతువును శాంతింపజేయడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ, అందులో తేలికైన మార్గంగా ఒకటి కనిపిస్తుంది. అదేమిటంటే ... కుక్కను పెంచడం.
కేతుగ్రహ సంబంధమైన దోషం కారణంగా బాధలు పడుతున్న వాళ్లు కుక్కను పెంచుకోవడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది. కుక్కను తాడుతో గానీ ... గొలుసుతో గాని కట్టకుండా, దానిని పెంచుతూ పోషిస్తూ వుండాలి. అందుకు అవకాశం లేకపోతే కుక్కలకు అనునిత్యం ఆహారాన్ని అందించినా సరిపోతుంది. ఈ విధంగా చేయడం వలన కేతువు ప్రసన్నుడవుతాడనీ, దాంతో ఫలితాలు అనుకూలంగా మారతాయని చెప్పబడుతోంది.