సాక్షాత్తు శ్రీరాముడే ఇక్కడికి వచ్చాడట !
సాధారణంగా మహర్షులు ... మహాభక్తుల అభ్యర్థన మేరకు దేవుడు ఆయా ప్రదేశాల్లో ఆవిర్భవించడం జరుగుతూ వుంటుంది. అలా కాకుండా సాక్షాత్తు దేవుడే నేరుగా నడచుకుంటూ వచ్చి ఒక ప్రదేశంలో కూర్చుని శిలగా మారిపోతే అదో మహిమాన్వితమైన ఘట్టంగా చెప్పుకుంటూ వుంటారు. ఆ ప్రదేశాన్ని చూడటానికి ఆరాటపడుతుంటారు.
అలాంటి అనుభూతిని కలిగించే ప్రదేశంగా 'ఓర్ఛా' కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ లోని ఝాన్సీకి సమీపంలో ఓర్ఛా దర్శనమిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం రాజుల ఏలుబడిలో వుండేది. ఇక్కడ రాముడు ఆలయంలో కాకుండా మహల్లో దర్శనమిస్తూ వుండటం విశేషం. ఇందుకు కారణంగా ఆసక్తికరమైన కథనం ఒకటి ఇక్కడ వినిపిస్తూ వుంటుంది. రాణి గణేష్ కున్వరీ దేవి .. శ్రీరాముడి భక్తురాలు. సాక్షాత్తు శ్రీరాముడే తన రాజ్యంలోని ఆలయంలో కొలువుదీరేలా చేయాలని ఆమె నిర్ణయించుకుంటుంది. తన భక్తితో శ్రీరాముడిని మెప్పించగలననే నమ్మకంతో ఆలయ నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేయమని సిబ్బందిని ఆదేశిస్తుంది.
అయోధ్యకి చేరుకుని శ్రీరాముడి కటాక్షం కోసం అక్కడ తపస్సు చేస్తుంది. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన రాముడికి తన మనసులోని మాటను చెబుతుంది. ఆమె రాజ్యంలో తాను ఎక్కడైతే మొదటిసారిగా ఆశీనుడనైతనో అక్కడే శాశ్వతంగా ఉండిపోతానని చెబుతూ, బాలుడి రూపంలో ఆయన ఆమెను అనుసరిస్తాడు. రాణి ఆదేశించినట్టుగా ఆలయ నిర్మాణం పూర్తయినప్పటికీ, అలసట కారణంగా ఆమె ముందుగా తన మహల్ కి వెళుతుంది. ఆమెను అనుసరించిన ఆ బాలుడు ఒకచోట కూర్చుని, శ్రీరామచంద్రుడు రూపంలో విగ్రహంగా మారిపోతాడు.
అప్పుడు రాముడి మాటలు గుర్తుకు రావడంతో రాణి తాను చేసిన పొరపాటును గురించి తెలుసుకుంటుంది. సాధారణంగా రాముడు విల్లు - బాణాలు ధరించి నుంచుని ఆలయంలో దర్శనమిస్తూ వుంటాడు. అందుకు భిన్నంగా ఇక్కడ రాముడు కత్తి - డాలు ధరించి కూర్చుని, అలనాటి మహల్ లో కొలువై కనిపిస్తుంటాడు. ఇక్కడి ప్రజలు రాముడిని రాజుగా భావించి పూజిస్తూ వుంటారు. మహిమాన్వితమైన అలనాటి సంఘటనకి వేదికగా నిలిచిన ఈ ప్రదేశాన్ని తప్పక చూసితీరాలి.