ఈ వాహనసేవ వెనుక కథ వుంది !

బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీమహావిష్ణువుకి చెందిన వివిధ పుణ్యక్షేత్రాల్లో స్వామివారికి వివిధ వాహన సేవలను నిర్వహిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో గజ .. అశ్వ .. హనుమ .. గరుడ మొదలైన వాహనాలపై స్వామివారు ఊరేగుతూ వుంటారు. అలాగే శైవ సంబంధమైన కొన్ని పుణ్యక్షేత్రాల్లో శివుడు నంది వాహనం ... రావణ వాహనంపై ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ వుంటాడు.

అయితే త్రిమూర్తి స్వరూపుడైన శ్రీసత్యనారాయణస్వామి ఉత్సవాలలోను రావణ వాహనసేవ కనిపించడం కొంతమంది భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడి బ్రహ్మోత్సవాలలో రావణ వాహనంపై స్వామివారు ఊరేగడానికి వెనుక పురాణ పరమైన కథనం కనిపిస్తుంది.

ఒకప్పుడు రావణుడు తన పుష్పక వాహనంలో ఈ క్షేత్రం మీదుగా వెళుతూ ఉండగా అది హఠాత్తుగా ఆగిపోతుంది. కారణమేమై ఉంటుందా అని రావణుడు పరిశీలించగా, ఇక్కడ ఒకే శిలపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుదీరిన విషయం ఆయనకి అర్థమవుతుంది. త్రిమూర్తి స్వరూపుడైన స్వామి సత్యనారాయణస్వామి పేరుతో పూజలు అందుకుంటున్నాడని తెలుస్తుంది.

దాంతో వెంటనే ఆయన వాహనం దిగి వచ్చి స్వామివారు ఆవిర్భవించిన ప్రదేశానికి చేరుకుంటాడు. శ్రీమన్నారాయణుడుని ద్వేషించే రావణుడు, ఆయనతో పాటు శివుడు కూడా ఒకే శిలపై కొలువై వున్న కారణంగా ఆ శిలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. అలా శివుడితో పాటు శ్రీమన్నారాయణుడు కూడా ఆయన పూజలు అందుకున్న ప్రదేశంగా 'అన్నవరం' చెప్పబడుతోంది.

పరమ పవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించి .. త్రిమూర్తి స్వరూపుడైన స్వామివారిని రావణుడు ప్రత్యక్షంగా పూజించిన కారణంగా, బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు 'రావణ వాహనం'పై కూడా ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు. నయనానందాన్ని కలిగిస్తూ పుణ్య ఫలాలను ప్రసాదిస్తూ వుంటాడు.


More Bhakti News