బాధను నివారించడమే బాబా గొప్పతనం

ఎప్పటిలానే బాబా గ్రామంలోకి వెళ్లి తాను ఎంచుకున్న అయిదు ఇళ్ల నుంచి భిక్ష అడిగి తెచ్చుకుంటాడు. ఆ భిక్షలో కొంత భాగాన్ని మూగ జీవాలకు వేసి మిగతాది పక్కన పెట్టేస్తాడు. ఆయన అలా భోజనం చేయకుండా కూర్చోవడం చూసిన మహాల్సాపతి, కారణం అడుగుతాడు. తాత్యా రాగానే అతనితో కలిసి భోజనం చేస్తానని అంటాడు బాబా.

అతను ఏదో పనిపై బయటికి వెళ్ళాడనీ ... ఎప్పటికి వస్తాడో తెలియదు కనుక భోజనం చేయడమే మంచిదని చెబుతాడు మహాల్సా. మేనల్లుడిని వదిలి తాను తినలేనని చెబుతాడు బాబా. ఆ మాట వినగానే మహాల్సా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది చూసిన బాబా ఆయన ఆవేదనకి గల కారణం అడుగుతాడు.

బాబా కొందరిని ప్రేమతో వరుసలు పెట్టి పిలుస్తూ వుండటం గురించి మహాల్సా ప్రస్తావిస్తాడు. ఆయనని భగవంతుడిగా భావిస్తోన్న తనని మాత్రం ఎలాంటి వరుసతోను పిలవకపోతుండటం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తాడు. తనని ఆయన భగవంతుడిగా భావించి ఆరాధిస్తోన్న విషయం తనకి తెలుసనీ, అందువలన తాను ఆయనని భక్తుడిలానే చూస్తున్నాని చెబుతాడు బాబా.

ఇకపై ఆయన సంతోషం కోసం 'భక్తా' అని పిలుస్తానని అంటాడు. భగవంతుడికీ ... భక్తుడికి మధ్య గల అనుబంధం శాశ్వతమైనదనీ ... అనేక జన్మల పాటు ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంటుందని చెబుతాడు. అలా తమ మధ్య గల అనుబంధం శాశ్వతమై నిలుస్తుందని అంటాడు. ఆ మాటలు మహాల్సా మనసుకి ఊరట కలిగిస్తూ ఔషధంలా పనిచేస్తాయి. దాంతో ఆయన సంతోషంతో పొంగిపోతూ బాబా పాదాలకు నమస్కరిస్తాడు. ఆ రోజు నుంచి బాబా ఆయనని భక్తా అనే పిలిచేవాడట.


More Bhakti News