లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచించే కల !

కలలు రావడం ... అవి ఆనందాన్నో ... ఆందోళననో కలిగించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది తమకి ఎలాంటి కల వచ్చినా పెద్దగా పట్టించుకోరు. మరికొందరు తమకి వచ్చిన కలను పదే పదే గుర్తు చేసుకుంటారు. ఆ కల నిజమవుతుందా ... కాదా ? అనే విషయాన్ని గురించి ఆలోచిస్తారు. తమకి వచ్చిన కలకు అర్థమేమిటో ... దాని ఫలితమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

సాధారణంగా కలలో ... నిత్యజీవితంలో మనం చూసేవి ... చూడనివి అయినటువంటి చిత్రవిచిత్రమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. వచ్చిన కల ఫలితాన్ని ఇవ్వడమనేది ఆ కల వచ్చిన సమయంపై ... కలగనే వ్యక్తి మానసిక స్థితిపై ఆధారపడి వుంటుంది. ఈ నేపథ్యంలో కలలో పూలు కనిపించడమనేది శుభప్రదమైనదిగా చెప్పబడుతోంది. పూలలో తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న గులాబీలు కనిపించడం మరింత మంచిదని అంటారు.

లక్ష్మీదేవికి గులాబీ పూలు ఎంతో ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ కారణంగానే శ్రావణ మాసంలో 'వరలక్ష్మీ వ్రతం' రోజున కూడా అమ్మవారిని గులాబీ పూలతో పూజిస్తూ వుంటారు. లక్ష్మీదేవిని గులాబీలతో అర్చించడం వలన ఆ తల్లి వెంటనే సంతృప్తిచెంది అనుగ్రహిస్తుంది. అంతగా అమ్మవారి మనసు గెలుచుకునే గులాబీలు కలలో కనిపించడం, లక్ష్మీదేవి రాకకు సంకేతంగా చెప్పబడుతోంది. అందువలన కలలో గులాబీలు కనిపించడం శుభ సంకేతంగా భావించాలని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News